ఆ గవర్నమెంట్‌ స్కూల్లో చేరితే క్షవరం ఉచితం!

Update: 2015-06-28 05:03 GMT
తల్లిదండ్రుల దృష్టి అంతా ఇప్పుడు ప్రైవేట్‌ పాఠశాలల మీదే ఉంది. ఒకవైపు ప్రభుత్వం విద్యపై, స్కూళ్ల నిర్వహణపై కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నా.. ప్రభుత్వ పాఠశాలపై మాత్రం ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేకుండా పోయింది. గవర్నమెంటు స్కూళ్లలో చదివితే చదువు రాదు.. అనే విశ్వాసం బలంగా ఏర్పడింది. దశాబ్ద కాలంలో ఇది మరింతగా పెరిగింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు లేకుండా పోయాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ తీరు పెరిగిపోయింది.

    ఇలాంటి నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాము చదువు బాగా చెబుతాం మీ పిల్లల్ని పాఠశాల్లో చేర్పించండి అంటూ వారు తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నారు. అయితే వారి హామీని విశ్వసించే వాళ్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఆఫర్లను కూడా ఇస్తున్నారు టీచర్లు.

    వరంగల్‌ జిల్లా ఉప్పుగల్లు ప్రాథమిక పాఠశాలలో ఇలాంటి ఆఫరే ఒకటి ప్రకటించారు. ఆ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు క్షవరం ఫ్రీ అని ప్రకటించారు. స్కూల్లో చదివే పిల్లలకు ప్రతిశనివారం, ఆదివారం ఉచితంగా క్షవరం చేస్తారట. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చి.. స్కూల్‌లో అడ్మిషన్లను పెంపొందించే పనిలో పడ్డారు టీచర్లు. మరి వీరి ప్రయత్నం ఎంత వరకూ ఫలితాన్నిస్తుందో చూడాలి!

    ఇదిలా ఉంటే.. ఇదే జిల్లాకు చెందిన తిడుగు అనే గ్రామంలోని ఉన్నతపాఠశాలలో టీచర్లు విద్యార్థుల కోసం బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు! టీచర్లంతా డబ్బు పోగేసి.. అద్దె బస్సును ఏర్పాటు చేసి పిల్లలను స్కూల్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. మరి వీళ్ల చొరవను గుర్తించి అయినా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగితే మేలేమో!

Tags:    

Similar News