మేరియుపోల్ లో మారణహోమం జరిగిందా ?

Update: 2022-04-23 11:30 GMT
ఉక్రెయిన్లోని మేరియుపోల్ నగరంలో రష్యా సైన్యం మారణహోమానికి పాల్పడిందా ? అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై  యుద్ధం కారణంగా రష్యా సైన్యాలు అనేక నగరాల్లో ఊచకోతకు పాల్పడుతున్న విషయంలో తెలిసిందే. మొత్తం ఉక్రెయిన్లో లక్షల మంది సైనికులు, మామూలు పౌరులు కూడా మరణించి ఉంటారని అంచనా.

అలాంటిది మేరియుపోల్ నగరానికి సంబంధించి ఉపగ్రహం అందించిన ఫొటోలు చూసిన తర్వాత అందరు ఉలిక్కిపడుతున్నారు. సదరు ఫొటోల్లో లెక్కలేనన్ని సమాధులు కనబడుతున్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం ఈ నగరంలోనే లక్షకుపైగా జనాలు చనిపోయుంటారని అంచనా.

ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించిన మరణాలే 25 వేలు. యుద్ధం పేరుతో వేలాదిమందిని చంపేసిన రష్యా సైన్యం ఆ విషయం బయటపడకుండా సామూహికంగా పాతిపెట్టేస్తోందని బయటపడింది.

శాటిలైట్ ఫొటొల్లో వేలాది సమాధాలు కనబడుతున్నాయి. మేరియుపోల్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దాదాపు 45 రోజులు శతవిధాల ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో వేలాదిమంది సైనికులను చంపటాన్ని పక్కనపెట్టేస్తే వేలాది పౌరులను చంపటానికి కూడా వెనకాడలేదు. దీంతో ఒక్క మేరియుపోల్లో మాత్రమే సుమారు లక్షమంది చనిపోయుంటారని అంచనా వేస్తున్నారు.

మేరియుపోల్ సమీపంలోని మన్ హుష్ పట్టణంలో 200కు పైగా సమాధులను తవ్వారు. వాటిల్లో అంతకుమించి మృతదేహాలు బయటపడ్డాయి. మేరియుపోల్లో చంపేసి మన్ హుష్ పట్టణానికి తీసుకొచ్చి సమాధి చేసినట్లు అనుమానిస్తున్నారు. యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకునేందుకే రష్యా సైన్యం ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటివరకు ఇలాంటి సమాధులను 9 వేలు గుర్తించినట్లు ఉక్రెయిన్ సిటీ కౌన్సిల్ అధికారులు చెప్పారు. మేరియపోల్ జనాభానే 4 లక్షలు. ఇందులోనే అనధికారికంగా లక్ష కానీ లేదా అధికారికంగా 25 వేలమంది కానీ చనిపోయారంటే చిన్న విషయం కాదు. దాదాపు లక్షమందిని చంపేసిన తర్వాత రష్యా మేరియుపోల్ ను ఆక్రమించుకుంటే ఏమిటో ఆక్రమించుకోకపోతే ఏమిటి ?
Tags:    

Similar News