ల‌క్ష‌ల మంది ఘోష‌కు బోడి సారీనా?

Update: 2018-12-09 05:03 GMT
వేలాది మంది ప‌ని చేశారు. కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు అయ్యాయి. తీరా చూస్తే.. ల‌క్ష‌లాది మంది క‌డుపు మండే ప‌రిస్థితి. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆఖ‌రి అంకం ముగియ‌టానికి మ‌రో రెండు రోజుల వేళ‌.. తెలంగాణ రాష్ట్రంలో ల‌క్ష‌లాది మంది తీవ్ర ఆగ్ర‌హాంతో ఉన్నారు.

త‌మ‌ను పాలించే అధినేత‌ను ఎన్నుకోవ‌టానికి పోలింగ్ స్టేష‌న్ల‌కు వెళ్లిన ప‌లువురికి.. వారి ఓట్లు లేవ‌ని.. ఓటు వేయ‌టానికి అన‌ర్హుల‌న్న మాట చెప్ప‌టంతో ప‌లువురికి ఒళ్లు మండింది. ఆన్ లైన్ లోని ఓట‌రు లిస్టులో ఓటు ఉన్న‌ప్ప‌టికి.. పోలింగ్ బూత్ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి మాత్ర‌మే ఓటు లేదంటూ అధికారులు చెప్ప‌టాన్ని ప‌లువురు జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మ ఓటు ఎలా మిస్ అవుతుందంటూ అధికారుల్ని నిల‌దీస్తున్నారు.

ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల సంఘం.. తెలంగాణ‌లో ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు నెల‌కొంద‌న్న సూటి ప్ర‌శ్న‌కు నేరుగా స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. ఓవైపు ఓటు వేయాల‌ని భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్న అధికారులు.. మ‌రోవైపు న‌మోదు చేసుకున్న ఓట్ల‌ను.. ఇప్ప‌టికే జాబితాలో ఉన్న ఓట్లు ఎలా గ‌ల్లంతు అయ్యాయి?  దీనికి కార‌ణం ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

పెద్ద ఎత్తున ఓట్ల గ‌ల్లంతుపై ఓట‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. తెలంగాణ ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ సారీ చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు అయిన సెప్టెంబ‌రు 6 నుంచి ఓట‌ర్ల జాబితాపై ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించిన‌ప్ప‌టికీ.. పోలింగ్ వేళకు వ‌చ్చేస‌రికి మాత్రం ప‌లువురి ఓట్లు క‌నిపించ‌కుండా ఉండ‌టంపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఓట్ల మిస్సింగ్‌లో ఎన్నిక‌ల సంఘానిదే బాధ్య‌త అని స్ప‌ష్టంగా చెబుతున్న వేళ‌.. సీన్లోకి వ‌చ్చిన సీఈవో ర‌జ‌త్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ఓట‌ర్ల‌కు సారీ చెప్పారు.సెప్టెంబ‌రు 25 నాటికి ఓట్ల కోసం అప్లై చేసిన వారిని అక్టోబ‌రు 12న విడుద‌ల చేసిన జాబితాలో చేర్చిన‌ట్లుగా చెప్పారు. అదే స‌మ‌యంలో వెబ్ సైట్లో అప్డేట్ చేసే విష‌యంలో జ‌రిగిన పొర‌పాటుతో పెద్ద సంఖ్య‌లో ఓట్లు లేకుండా పోయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కొన్ని పేర్లు వెబ్ సైట్‌లో రికార్డు అయిన‌ప్ప‌టికీ తాము పంపిన జాబితాలో మిస్ అయిన‌ట్లుగా చెప్పిన ర‌జ‌త్ కుమార్‌.. ఓట‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన త‌ర్వాత‌.. తీరిగ్గా సారీ చెబితే స‌రిపోతుందా? అన్న‌ది క్వ‌శ్చ‌న్‌. ల‌క్ష‌లాది మందికి సంబంధించిన అంశాన్ని ఆచితూచి అన్న‌ట్లు జాగ్ర‌త్త‌గా డీల్ చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అధికారులు ప‌ని చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఓట్లు వేయ‌లేక మండిప‌డుతున్న ల‌క్ష‌లాది మందికి ర‌జ‌త్ కుమార్ సారీ బోడీ సారీగానే క‌నిపిస్తుంది త‌ప్పించి.. వారికి ఎలాంటి ఉప‌శ‌మ‌నం ఇవ్వ‌ని ప‌రిస్థితి.


Tags:    

Similar News