ఎంతైనా విత్ డ్రా చేసుకునే రోజు వచ్చేసిందోచ్

Update: 2017-02-08 13:27 GMT
ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకోవటం పెద్ద విషయమే కాదన్నట్లు ఉండేది. కానీ.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా అన్నది ఎంత కష్టమైన..క్లిష్టమైన విషయమన్నది పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశప్రజలందరికి అర్థమైంది. రూ.2500 మొత్తం కోసం గంటల కొద్దీ టైంను క్యూ లైన్లలో గడపాల్సి రావటాన్ని ఏ ఒక్కరూ అంత తేలిగ్గా మర్చిపోలేరని చెప్పాలి. సేవింగ్స్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ కు రోజుకు రూ.2500 మొత్తాన్ని మాత్రమే డ్రా చేసుకునే వెసులుబాటు ఇచ్చిన ఆర్ బీఐ.. తర్వాతికాలంలో ఆ లిమిట్ ను పెంచటం తెలిసిందే.

ప్రస్తుతం వారానికి రూ.24వేల మొత్తాన్ని విత్ డ్రా చేసే వెసులుబాటును.. మరికొద్ది రోజుల్లో రూ.50వేలకు పెంచనున్న తీపికబురును ఆర్ బీఐ వెల్లడించింది. ఈ పెంపును ఈ నెల 20 నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొంది. మరింత పెద్ద శుభవార్త ఏమిటంటే.. మార్చి 13 తర్వాత సేవింగ్స్ అకౌంట్స్ కు సంబంధించి విత్ డ్రా మీద ఎలాంటి పరిమితులు ఉండవని ఆర్ బీఐ వెల్లడించింది.

దేశం మొత్తమ్మీదా చలామణీలోకి వచ్చిన నగదు విలువ అక్షరాల రూ.9.92లక్షల కోట్లు (జనవరి 27 నాటికి)గా ఆర్ బీఐ పేర్కొంది. కొత్తగా వచ్చిన రూ.2వేలు.. రూ.500నోట్లను నకిలీలు తయారు చేయటం అసాధ్యమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్ర స్పష్టం చేశారు. నకిలీల ముచ్చట పక్కన పెడితే.. విత్ డ్రా మీద పరిమితిని ఎత్తేయనుండటంతో ప్రజలకు ఏటీఎం కష్టాల నుంచి పూర్తిగా రిలీఫ్ దొరకటం ఖాయమని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News