బెంగాల్ దంగల్ః టీఎంసీ గెలిచి.. మ‌మ‌త ఓడిపోతే..?

Update: 2021-04-30 08:30 GMT
ఇది ఖ‌చ్చితంగా విచిత్ర‌మైన స‌మ‌స్యే. బ‌హుశా ఈ సందేహం చాలా మందికి రాక‌పోవ‌చ్చు. కానీ.. ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చిన త‌ర్వాత చాలా మందిలో ఈ త‌ర‌హా డౌట్ వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌శ్చిమ బెంగాల్ లో తృణ‌మూల్ కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్య హోరాహోరీగా పోరు సాగింది. మరి, విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న ప్ర‌శ్న‌కు ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకే ఎడ్జ్ చూపించాయి. బొటాబొటి మెజారిటీతో తృణ‌మూల్ గెలుస్తుంద‌ని కూడా కొన్ని సంస్థ‌లు జోస్యం చెప్పాయి. కొద్దిమేర సీట్లు అవ‌స‌ర‌మైతే.. క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ కూట‌మి మద్ద‌తు అవ‌స‌రం అవుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి.

అయితే.. మ‌మ‌తా బెన‌ర్జీ గెలుపు ఓట‌ముల‌పైనా ఆస‌క్తిక‌ర‌మైన ఫ‌లితాన్ని ప్ర‌క‌టించాయి ఎగ్జిట్ పోల్ సంస్థ‌లు. మ‌మ‌త ఈ సారి త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన భ‌వానీపూర్ ను వ‌దిలి నందిగ్రామ్ నుంచి బ‌రిలో నిలిచారు. తృణ‌మూల్ ను వీడి బీజేపీ గూటికి చేరిన సువేంద్ అధికారి ఇక్క‌డ కాషాయ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. ఆయ‌న‌కు నందిగ్రామ్ లో మంచి ప‌ట్టు ఉంది.

త‌న‌ను ధిక్కరించి వెళ్లిన సువేందును ఎలాగైనా ఓడించాల‌ని ఆయ‌న‌పైనే పోటీకి దిగారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. అయితే.. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల ప్ర‌కారం పోటీ చాలా తీవ్రంగా ఉంద‌ని అంటున్నారు. కొన్ని సంస్థ‌లైతే.. మ‌మ‌త ఓడిపోయే అవ‌కాశం ఉంద‌ని కూడా చెప్పేశాయి. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోందోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

ఒక‌వేళ‌ మమతా బెన‌ర్జీ ఓడిపోయి, తృణమూల్ గెలిస్తే.. ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. సోనియా గాంధీ మాదిరిగా రిమోట్ ను ద‌గ్గ‌ర పెట్టుకొని వేరే వ్య‌క్తిని సీఎం చేయడం తప్ప, ఆమె చేతిలో మరో మార్గం లేదు. అలా చేయాల్సి వ‌స్తే.. ఆమె మేన‌ల్లుడు అభిషేక్ బెనర్జీ రేసులోకి రావొచ్చు. అది కూడా ఆయన గెలిస్తే! లేదంటే.. మ‌రొక విధేయుడికి ప‌ట్టాభిషేకం చేయొచ్చు. కానీ.. అలా జ‌రిగితే పార్టీ ప‌రిస్థితి మునుపటిలా ఉంటుందా? అన్న‌ది సందేహం.
Tags:    

Similar News