బంగారు తెలంగాణలో ఈ బలిదానాలేంది సారూ?

Update: 2019-10-29 05:34 GMT
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వచ్చే లాభాల గురించి అదే పనిగా ఏకరువు పెట్టేవారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉద్యమనేతగా అప్పట్లో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు యావత్ తెలంగాణను ఊపేసేవి. మన తెలంగాణలో మన ప్రభుత్వం పవర్లో ఉంటే మన బిడ్డల కష్టాలు మనకు మించి బాగా మరెవరికి అర్థమవుతాయన్న మాటలు వినిపించేవి.

అనుకున్నట్లే తెలంగాణ వచ్చింది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కొలువు తీరింది. మరి.. అలాంటప్పుడు ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి పేచీలు ఉండకూడదు. కానీ.. 24 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే సర్కారు నుంచి సానుకూలత రాకపోగా.. షాకింగ్ వ్యాఖ్యలు సీఎం నోటి నుంచి వస్తున్న తీరు నోట మాట రాకుండా చేస్తోంది.

తెలంగాణ ఉద్యమ వేళలో తాము కలలు కనే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసేవారు. ఇలాంటివేళ కేసీఆర్  నోట నిప్పుల్లాంటి మాటలు వచ్చేవి. దరిద్రపుగొట్టు రాష్ట్రంలో తమ వారిని పీక్కుతింటున్న రాబంధుల్లాంటి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టేవారు కేసీఆర్. అలాంటి ఆయనే ప్రభుత్వాధినేతగా మారటం తెలిసిందే.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో తాజాగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె 24 రోజుకు చేరుకోవటమే కాదు.. ఇప్పటివకే తమ భవిష్యత్తు మీద నిరాశ మేఘం కమ్ముకొని కొందరు ప్రాణత్యాగం చేస్తే.. మరికొందరు తమ చావుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందన్న ఉద్దేశంతో ఆత్మ బలిదానాలు చేసుకోవటం షురూ అయ్యింది.

అలాంటి ఉదంతమే మరొకటి ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి బలవన్మరణ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే అదే జిల్లాకు చెందిన సత్తుపల్లి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న నీరజ తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. తాను పని చేస్తున్న ఉద్యోగం ఉంటుందో.. ఉండదనో వేదనతో ఆమె ఇంట్లోనే ఉరి వేసుకొని తనువు చాలించారు.

గడిచిన 24 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న ఆమె.. ఉద్యోగం ఉంటుందా? ఉండదా? అన్న భయాందోళనలకు గురైన ఆమె తాజాగా ఇంట్లో ఊరి వేసుకున్నారు. ఆమెకు భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. పోరాడి సాధించుకొని తెచ్చుకున్న తమ రాష్ట్రంలో తాము ఎదుర్కొంటున్నఇబ్బందుల్ని సీఎం పట్టించుకోని వైనంపై వేదన చెందుతున్న కార్మికులు ఇలా బలిదానాలు చేసుకోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News