కొత్త వైరస్ లో మార్పులకు కారణం ఏమిటి? శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటి?

Update: 2020-12-23 03:30 GMT
కంటికి కనిపించని కోవిడ్ కుటుంబం ఇంత పెద్ద ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కోవిడ్ 19లో పదకొండు ఉప గ్రూపులు ఉన్నా.. అవేవీ అంత డేంజర్ కాదు. కానీ.. తాజాగా గుర్తించిన  ‘‘ఏ2బీ’’ వర్గానికి చెందినది మహా ప్రమాదకరమైనది. ఆ మాటకు వస్తే.. ఇదేమీ ప్రాణాలు తీయదు. కాకుంటే.. ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కోవిడ్ 19తో పోలిస్తే (మరింత వివరంగా చెప్పాలంటే ‘‘ఏ2ఏ’’ వర్గం వైరస్) 70 శాతం వేగంగా విస్తరించే పాడు గుణమే ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తోంది. వ్యాక్సిన్ వచ్చేసింది.. మరో ఆర్నెల్ల్లో కోవిడ్ 19ను చాప చుట్టేయొచ్చన్న భావనను తుంగలో తొక్కి.. మళ్లీ లాక్ డౌన్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తున్న దుస్థితి.

ఇంతకీ ఈ ‘ఏ2బీ’ ఎలా మార్పు చెందింది? దాని వెనుకున్న కారణం ఏమిటి?  అన్న విషయానికి వెళతే.. శాస్త్రవేత్తలు ఆసక్తికర అంశాల్ని వెల్లడిస్తున్నారు. కోవిడ్ 19 వైరస్ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రోగ నిరోధక శక్తి ఉన్న అతి కొద్ది మంది కరోనా రోగుల్లో కొన్ని నెలల పాటు వైరస్ ఉంటుంది. అలా ఉన్న వైరస్ కుదురుగా ఉండకుండా.. శరీరం లోపల అనేక మార్పులకు గురవుతుంటుంది.

అలా వచ్చిన మార్పులకు గురై.. అది కాస్తా బయటకు వచ్చి.. వేరే వారిలోకి చేరుతుంది. అలా చేరే వైరస్.. మరిన్ని మార్పులకు గురవుతుంటుంది. ఇదో విధానమైతే.. రెండో విధానం జంతువుల్లోకి వైరస్ వెళ్లి మార్పులు చెంది.. ఆ మారిన వైరస్ తిరిగి మనుషుల్లోకి చేరటం. ఈ పద్దతిలోనూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. డెన్మార్క్ లో మింక్ అనే క్షీరదం కరోనా బారిన పడటంతో.. లక్షలాది మింక్ జంతువుల్ని చంపేసి పాతిపెట్టాలని నిర్ణియించటం తెలిసిందే.

అలా జంతువుల్లోకి చేరిన కోవిడ్ 19.. మరిన్ని మార్పులకు లోనవుతుంది. తిరిగి అది కాస్తా.. మనిషి శరీరంలోకి మారుతుంది. ఆ మార్పులే ఇప్పుడు ప్రపంచాన్ని మరింతగా వణికిస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? కోవిడ్ 19 తాజా వైరస్ ఎలా మారిందో?
Tags:    

Similar News