మోడీకి రాసిన లేఖలో సీఎం జగన్ ఏమేం చెప్పారు?

Update: 2020-11-01 07:50 GMT
ఏపీ ప్రజల తలరాతల్ని మార్చే పోలవరం ప్రాజెక్టు విషయంపై ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా కేంద్రం తీరు ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనికి సంబంధించిన లేఖను మంత్రి అనిల్ కుమార్ విడుదల చేశారు. ఇంతకూ ప్రధాని మోడీని ముఖ్యమంత్రి జగన్ ఏం కోరారు? లేఖలో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటి? అన్నది చూస్తే..

-  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యమైతే.. విస్తృత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ప్రాజెక్టు అంచనాల అంశంలో మీరే చొరవ తీసుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ మంత్రులతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దండి.

-  మ్మడి ఏపీలో పోలవరం కోసం రాష్ట్రం రూ.5135 కోట్లు వ్యయం చేసింది. సత్వర మౌలిక లబ్ధి పథకం కింద పోలవరం అంచనా వ్యయం 2010-11 నాటికి 16010.45 కోట్లుగా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం గుర్తించింది. కేంద్రం 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి పరిహారం, సహాయ, పునరావాసాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చింది.

-  కేంద్ర కేబినెట్‌ నిర్ణయం, విభజన చట్టం ప్రకారం పోలవరం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అందుకే, ఈ ప్రాజెక్టు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ గా పోలవరం ప్రాజెక్టు అథారిటీని 2014 మే 28న కేంద్రం ఏర్పాటు చేసింది.

-  విభజనచట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. నిర్మాణ వ్యయం.. సహాయ పునరావాసాలను చట్టం పరిధిలో భరిస్తామన్నారు.  ఈ చట్టం ప్రకారం రాష్ట్రం కేవలం కార్యనిర్వాహక బాధ్యతలు మాత్రమే చేపడుతోంది.

-  పోలవరం అంచనా వ్యయం 2010-11 ప్రకారం 16,010.45 కోట్లు. 2013-14లో అది రూ.28919.95 కోట్లకు చేరింది. సవరించిన అంచనా వ్యయాన్ని.. ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్సును తొలిసారి 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. అంచనాలను పంపాలని రాష్ట్రాన్ని కోరింది.

-  సవరించిన డిజైన్లు.. ముంపు బాధిత కుటుంబాల పునరావాసం అంచనాలు లెక్క కట్టి 2019 జనవరిలో రూ.57297.42 కోట్లుగా పంపాం. దీన్ని పరిశీలించిన సాంకేతిక సలహా కమిటి వాస్తవ వ్యయం రూ.55,548.74 కోట్లుగా నిర్దారించారు. దీన్ని సమీక్షించి 2020జూన్ లో రూ.47,617.74 కోట్లుగా తేల్చారు. ఈ సవరణ అంచనాలకు ఇప్పటివరకు క్లియరెన్సు రాలేదు.

-  కేంద్రం ఇచ్చిన హామీలకు.. విభజన చట్టానికి ఇది విరుద్ధం. పునరావాసానికే రూ.28,191 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా.. రూ.20.398.61 కోట్లతో పోలవరం ఎలా పూర్తి చేస్తాం? తాజా పరిస్థితి తలెత్తుకోలేని విధంగా, ఇబ్బందికరంగా మారింది.
Tags:    

Similar News