ఎమ్మెల్సీ కౌంటింగ్ః ప‌గిలి ఉన్న బ్యాలెట్ బాక్సుల తాళాలు ఏం జ‌రిగింది?

Update: 2021-03-17 11:59 GMT
తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఓట్ల‌ కౌంటింగ్ లో బ్యాలెట్ బాక్సులు ముందుగానే తెర‌చి ఉండ‌డం వివాదాస్ప‌ద‌మైంది. బ్యాలెట్ బాక్సుల‌కు వేసిన తాళాలు ప‌గ‌ల‌గొట్టి క‌నిపించ‌డంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఇందులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ నినాదాలు చేశారు.

న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్‌- ఖ‌మ్మం ప‌ట్టుభ‌ద్రుల స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు న‌ల్గొండ‌లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ‌కు చెందిన గోదాంలో ప్రారంభించారు. అయితే.. 6వ నెంబ‌ర్ టేబుల్ లో లెక్కించ‌డానికి తీసుకొచ్చిన బ్యాలెట్ బాక్సుల్లో ఎనిమిది బాక్సుల తాళాలు ప‌గిలి ఉన్నాయి. ఇక్క‌డే కాకుండా.. 7, 8, 10 కౌంటింగ్ టేబుళ్ల‌లోని ప‌లు బాక్సుల తాళాలు కూడా ప‌గిలి ఉన్నాయి.

దీంతో.. అక్ర‌మాలు జ‌రిగాయంటూ అభ్య‌ర్థులు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఫ‌లితంగా.. అక్క‌డ కాసేపు గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే.. ప‌లు బాక్సుల తాళాలు తెరుచుకోలేద‌ని, స‌మ‌యం మించి పోతుండ‌డంతోనే వాటి తాళాలు ప‌గ‌ల‌గొట్టామ‌ని అధికారులు తెలిపారు. ఏజెంట్ల ముందే ఈ ప‌నిచేశామ‌ని చెప్ప‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

కాగా.. ప్ర‌స్తుతం బండిళ్లు క‌ట్టే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఈ పని పూర్త‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆ త‌ర్వాత కౌంటింగ్ చేప‌ట్ట‌నున్నారు. అర్ధ‌రాత్రి లోపు తొలి ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News