అప్పీల్ చేసి జ‌గ‌న్‌ సాధించిందేమిటీ?

Update: 2021-12-15 07:19 GMT
కొంత కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతూనే ఉంది. టికెట్ల‌ను ప్ర‌భుత్వ‌మే ఆన్‌లైన్ ద్వారా విక్ర‌యిస్తుంద‌ని, అన్ని సినిమాల‌కు ఒకే టికెట్ రేటు ఉంటుంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. చిన్ని సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని చ‌ల‌న చిత్రాల‌కు ఒకే టికెట్ రేట్ ఉంటుంద‌ని టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ జీవో 35ను కూడా విడుద‌ల చేసింది.

కానీ మ‌రోవైపు సినిమాకు సంబంధించిన టికెట్ల విక్ర‌యాల‌పై ప్ర‌భుత్వ ఆధిప‌త్యాన్ని జ‌న‌సేన అధినేత సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో స‌హా సినిమా రంగానికి చెందిన కొంత‌మంది ప్ర‌ముఖులు వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే ఏకంగా ప్ర‌భుత్వ విధానంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పెద్ద సినిమా విడుద‌లైన‌పుడు టికెట్ రేట్లు పెంచుకునే సౌల‌భ్యం ఉండాల‌ని అంద‌రూ వైసీపీ ప్ర‌భుత్వాన్ని కోరారు. కానీ అందుకు సీఎం జ‌గ‌న్ ఒప్పుకోలేదు.

దీంతో ప్ర‌భుత్వ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ థియేట‌ర్ల యజ‌మానులు హై కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌భుత్వ నిర్ణ‌యం స‌రికాదంటూ థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో 35ను కోర్టు స‌స్పెండ్ చేసింది.

ఆ జీవోకి ముందు ఉన్న విధానంలోనే టికెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించుకునేందుకు థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు కోర్టు వెసులుబాటు క‌ల్పించింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రోసారి కోర్టులో చుక్కెదురైంది. అయితే ఈ విష‌యంపై ప్ర‌భుత్వం అప్పీల్ చేయాల‌ని అనుకుంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ ఈ అప్పీల్‌తో జ‌గ‌న్ సాధించేదేమిటీ అనే చ‌ర్చ‌లు జోరందుకున్నాయి.

థియేట‌ర్లు అనేవి ప్రైవేటు వ్యాపారం. కాబ‌ట్టి దీనిపై ప్ర‌భుత్వ పెత్త‌నం స‌రికాద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌ర్సింగ్ హోం, లాడ్జీలపై ప్ర‌భుత్వ నియంత్రణ లేన‌ప్పుడు కేవ‌లం థియేట‌ర్ల విష‌యంలోనే టికెట్ ధ‌ర‌ల‌ను ఎందుకు నియంత్రిస్తుంద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అయినా విమర్శ‌ల‌ను ప‌ట్టించుకోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ జీవో విడుద‌ల చేసింది.

కానీ ఇప్పుడేమైంది? కోర్టు దాన్ని కొట్టేసింది. ఇప్పుడిక ఈ విష‌యంపై అప్పీల్ చేస్తే మాత్రం ప్ర‌భుత్వానికి ఏం వ‌స్తుంది? తిరిగి జీవోను పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ఉంటుందా? అంటే లేద‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఒక‌సారి కోర్టు కొట్టేసిన జీవోను మ‌ళ్లీ ఎలా పున‌రుద్ధ‌రిస్తార‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

ఇక మ‌రోవైపు బాల‌కృష్ణ అఖండ సినిమాకు ఏపీలో కొన్ని చోట్ల టికెట్లు రూ.100 నుంచి రూ.150 రేటు వ‌ర‌కూ అమ్ముడుపోయాయి. కానీ ప్ర‌భుత్వం అప్పుడు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. కొంత‌మంది జిల్లా స్థాయి అధికారులు సుమారు రూ.15 ల‌క్ష‌లు తీసుకుని ఆ విష‌యం ప‌ట్ట‌నట్లు ఉన్నార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో టికెట్ల ధ‌ర విష‌యంలో ఇంకా లాగితే అది జ‌గ‌న్‌కే న‌ష్టం క‌లిగిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.




Tags:    

Similar News