మునిసిప‌ల్ ఎన్నిక‌లు నేర్పుతున్న పాఠం ఏంటి ?

Update: 2021-03-15 01:35 GMT
ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. వైసీపీ ప్ర‌భంజ‌నం జోరుగా సాగింది. ఇక‌, పుంజుకుంటుంద‌ని భావించిన టీడీపీ.. తీవ్ర ఇబ్బందుల్లో కూరుపోయింది. కేవ‌లం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి, మైదుకూరు (పూర్తిగా గెలిచింద‌ని చెప్ప‌లేం)లో మాత్ర‌మే మునిసిపాలిటీల‌ను ద‌క్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా టీడీపీ పుంజుకున్న‌ది లేదు. మ‌రోవైపు.. తూర్పుగోదావ‌రి, నెల్లూరు.. త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌న‌సేన కొన్ని వార్డుల‌ను ద‌క్కించుకుంది. ఇక‌, బీజేపీ కొవ్వూరులో ఒక వార్డును సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ ఎక్క‌డా అడ్ర‌స్ కూడా క‌నిపించ‌లేదు. ఇవి పైకి క‌నిపిస్తున్న ఫ‌లితాలు. మ‌రి ఈ ఫ‌లితాలు నేర్పుతున్న పాఠం ఏంటి?  ప్ర‌జ‌ల నాడి వెనుక ఉద్దేశం ఏంటి? అనేవి కీల‌క ప్ర‌శ్న‌లుగా మారాయి.

టీడీపీపై విశ్వ‌స‌నీయ‌త లేదా?

ప్ర‌స్తుతం వ‌చ్చిన ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌జ‌లు మూకుమ్మ‌డిగా వైసీపీ వైపు నిల‌బ‌డ‌డం వెనుక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై విశ్వ‌స‌నీయత‌ను కోల్పోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో నేత‌ల‌పై వారికి న‌మ్మ‌కం క‌ల‌గ‌లేద‌నే భావన వ్య‌క్త‌మ‌వుతోంది. అదేస ‌మ‌యంలో టీడీపీని గెలిపించినా.. ఏం చేస్తుంది ? అనే భావ‌న కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మైన‌ట్టు విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు రోడ్ షోలు నిర్వ‌హించిన మూడు కార్పొరేష‌న్లు.. విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరుల్లోనూ టీడీపీ పుంజుకోక‌పోవ‌డం.. తీవ్ర‌స్థాయిలో చ‌ర్చకు దారితీసింది. ఈ ఫ‌లితం.. టీడీపీని మ‌రోసారి షాక్‌కు గురి చేసింది.

ప్ర‌స్తుత ప‌రిణామాల్లో జ‌గ‌నే బెస్టా ?

ప్ర‌స్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌నే బెస్ట్ అనే వాద‌న బ‌లంగా ఉన్న‌ట్టు ప్ర‌జ‌లు వేసిన ఓట్ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. టీడీపీని తీసుకుంటే.. లోపాయికారీ.. ఒప్పందాలు.. సొంత‌గా పోటీ చేసే స‌త్తా లేక‌పోవ‌డం.. వంటివి స్ప‌ష్టంగా క‌నిపించాయి. కొన్ని చోట్ల జ‌న‌సేన‌కు.. వార్డుల‌ను వ‌దిలేయ‌డం.. మ‌రికొన్ని చోట్ల అంత‌ర్గ‌త ఒప్పందాలు చేసుకోవ‌డం .. వంటివి ప్ర‌భావం చూపాయి.

అదే స‌మ‌యంలో కేంద్రంలోని బీజేపీతో చంద్ర‌బాబు అనుస‌రించిన వైఖ‌రి, ఏపీకి అన్యాయం జ‌రుగుతున్నా.. ప‌ల‌క‌ని ఉల‌క‌ని.. ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలిపైనా ప్ర‌జ‌లు ఇప్పుడు తీర్పు చెప్పార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఒంట‌రిగా ఉంటూ.. త‌న స‌త్తా చాటుతూ.. ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌నే ప్ర‌జ‌లు న‌మ్మిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏదేమైనా.. ఈ ఎన్నిక‌లు.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌కు గ‌ట్టి పాఠం నేర్పాయ‌నేది విశ్లేష‌కుల మాట‌.
Tags:    

Similar News