ప్రపంచ కుబేరుడిగా అవతరించిన బెర్నార్డ్.. అసలు కథేంటి?

Update: 2022-12-17 01:30 GMT
నిన్నటి వరకు ప్రపంచ కుబేరుడు ఎవరంటే ఠక్కున ఎలాన్ మస్క్ అని ప్రతి ఒక్కరూ చెప్పేవారు. అయితే ఆ స్థానాన్ని ఎలాన్ మస్క్ చేజార్చుకున్నారు. ట్విట్టర్ ను హస్తగతం చేసుకునేందుకు ఏకంగా 44 కోట్ల మిలియన్ డాలర్లను కేటాయించడంతో అతని ఆస్తుల విలువ కొంతమేర తగ్గింది. అప్పటికీ కూడా ఎలాన్ మస్కే ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడిగా ఉన్నారు.

ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై ఎక్కువ ఫోకస్ పెడుతూ టెస్లా కంపెనీని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ కంపెనీ షేర్లు పతనవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతని ఆస్తుల విలువ 168.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ సంపద 172.9 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. దీంతో బెర్నార్డ్ ప్రపంచ కుబేరుడి జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు.

ఈ నేపథ్యంలోనే బెర్నార్డ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు. బెర్నార్డ్ ఏయే వ్యాపారాలు చేస్తారని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అతని వ్యక్తి జీవితాన్ని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మనం కూడా అతని స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

బెర్నార్డ్ ఇకోలో పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం ప్రముఖ వ్యాపారవేత్త ఫెరెట్ సావినెల్ కుటుంబ వ్యాపారంలో పని చేశాడు.  ఆ తర్వాత అమెరికాకు మకాం మార్చిన బెర్నార్డ్ 1981లో తండ్రికి వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత 1984లో మళ్లీ ఫ్రాన్స్ కు తిరిగొచ్చి అక్కడ దివాళా తీసిన బౌశాక్ సెయింట్ ఫ్రెరేస్ కంపెనీనీ కొనుగోలు చేశాడు.

ఈ కంపెనీ వస్తువులను క్రిస్టియన్ డయోర్ అనే బ్రాండ్ పేరిట ఫ్యాషన్ వస్తువులను ప్రమోట్ చేసి లాభాలను గడించాడు. ఇందులో వచ్చిన ఆదాయాన్ని ఇతర గ్రూపుల్లో పెట్టుబడి పెట్టి ఎంవీఎంహెచ్లో వాటాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం కంపెనీ ఛైర్మన్ గా బెర్నార్డ్ వ్యవహరిస్తుండటం విశేషం.

ఈ ఎంవీహెచ్లోనే లాయిస్ విటన్.. మోయెట్ హెన్నెస్సీ విలీనమయ్యాయి. ఈ క్రమంలోనే ఎంవీహెచ్ ను ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన వస్తువుల విక్రయాలకు కేరాఫ్ గా మారిపోయింది. ఈ కంపెనీకి 5వేల 500 స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీ షాంపేన్.. వైన్.. స్పిరిట్.. ఫ్యాషన్, లెదర్.. చేతి గడియాలు వంటి 70 రకాల ఫ్యాషన్ బ్రాండ్లను విక్రయిస్తోంది.

ప్రస్తుతం బెర్నార్డ్ వయస్సు 73 ఏళ్లు. తనకున్న అనుభవంతోనే మార్కెట్ ను అంచనా ఎన్నో లగ్జరీ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. యువ ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి పని చేశారు. ఆయన ఎప్పుడు కూడా పాత కంపెనీలను కొనుగోలు చేసి వాటిని సొంతంగా ఎదిగేలా చేశారు. ఇదే ఆయనలోని ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. బెర్నార్డ్ కు నలుగురు సంతానం కాగా వీరంతా కూడా ఎంవీఎంహెచ్ లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.

బెర్నార్డ్ ఆర్నోకు టెన్నిస్ ఆడటం.. పియానో వాయించడం అంటే ఎంతో ఇష్టం. తాను వరల్డ్ నెంబర్ టెన్నీస్ ప్లేయర్ లేదంటే పియానిస్ట్ కాలేకపోయానని కనీసం తన కంపెనీనైనా నెంబర్ వన్ గా నిలబెట్టాలని బెర్నార్డ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక తన రెండో భార్య హెలెన్ మర్సియర్ ను ఆకర్షించడం కోసం పియానో వాయించడం నేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే బెర్నార్డ్ కళాత్మక వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News