‘బతుకమ్మ’ చరిత్ర తెలిస్తే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి..

Update: 2020-10-16 07:45 GMT
కేవలం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. తెలంగాణ గొప్పతనాన్ని, సాంస్కృతిక ప్రత్యేకతను నిలబెట్టింది.  ఈ ఉత్సవం ఓ సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు.. చారిత్రక నిజం కూడా.  ఈ వేడుకకు వెయ్యేళ్ల చరిత్ర ఉందంటే అతీశయోక్తి కాదేమో. నిజాం నవాబు, దొరల దాష్టికాలను, నయా పెత్తందార్ల అణిచివేతలను సైతం ఎదురించి నిలబడ్డ వేడక ఇది. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచింది. ఇదిగో ఇదీ తెలంగాణ ప్రత్యేకత అంటూ యావత్​ ప్రపంచానికి సాక్షిభూతంగా నిలిచింది. తెలంగాణలో జరిగిన అన్ని ఉద్యమాల్లోనూ ఈ పండుగ పాలుపంచుకున్నది. ఈ బతుకమ్మ పండుగ పుట్టుక, విశిష్ఠత గురించి అనేక కథలు ఉన్నాయి. అటువంటి ప్రాచుర్యం ఉన్న ఓ కథను తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

ఎలా చేస్తారు?
రంగురంగుల పూలతో ( తెలంగాణ పల్లెసీమల్లో దొరికే గునుగుపూలు) బతుకమ్మను త్రికోణాకారంలో  పేరుస్తారు. యువతులు.. ఈ బతుకమ్మల చుట్టూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటారు. ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ..  ఇలా తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక కొనసాగుతుంది. చివరి రోజు బతుకమ్మలను నదిలో గాని సరస్సులో గాని చెరువులో గాని నిమజ్జనం చేస్తారు. కొన్ని వేల సంఖ్యలో ఈ బతుకమ్మ పాటలు ఉన్నాయి. తెలంగాణ చరిత్రను వారసత్వాన్ని చెప్పే పాటలు కొన్నైతే.. పురాణ, ఇతిహాస కథల ఆధారంగా పుట్టుకొచ్చిన పాటలూ ఉన్నాయి.

బతుకమ్మ చరిత్ర ఇదే..

తెలంగాణ ప్రాంతాన్ని తొలినాళ్లలో రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వేములవాడ చాళుక్యలు వారివద్ద సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు.. రాష్ట్ర కూటుల చివరి రాజు కర్కుడిని హత్య చేశాడు. అనంతరం కల్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో ఈ ప్రాంతాన్ని తైలపాడు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పట్లో వేములవాడ ఇక్కడి ప్రజలకు ఇలవేల్పు.. చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.

 అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010 లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించడం తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.

బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే.
Tags:    

Similar News