పవన్ ఇప్పుడేం చేస్తారు?

Update: 2022-09-02 05:33 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణాను పూర్తిగా వదిలేసినట్లే అనుమానంగా ఉంది. తెలంగాణాలో రాజకీయం  వేడిగా వాడిగా ఉంటున్న విషయం అందరూ చూస్తున్నదే. ఎందుకంటే వచ్చే డిసెంబర్లోగా తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరిగినా జరగచ్చనే వాతావరణం కూడా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే మునుగోడు ఉపఎన్నిక ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేసింది.

ప్రధాన పార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలుస్తుంటే జనసేన వైపునుండి మాత్రం అసలు చడీచప్పుడు వినబడటం లేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయటం లేదని పవన్ చెప్పటమే తప్పు. మునుగోడు ఉపఎన్నికకు జనసేన సిద్ధం కాలేదని, తమ కెపాసిటి ఏమిటో సాధారణ ఎన్నికల్లోనే చూపిస్తామని పవన్ ప్రకటించారు. అసలు జనసేనకు కెపాసిటి ఉందో లేదో తెలుసుకునేది ఎలాగ ? ఉపఎన్నికలో పోటీ చేసుంటే పార్టీ కెపాసిటి ఏమిటో బయటపడేది.

ఇప్పటికైతే జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు. పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళవుతున్నా ఇంతవరకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అసలు  కమిటీలే ఏర్పాటు కాలేదు. ఇప్పటికప్పుడు జనసేనకు ఉన్నదల్లా కేవలం పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రమే.

పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలించాయి, పార్టీకున్న సభ్యత్వం ఎంతనే విషయాన్ని పార్టీ ఇంతవరకు ప్రకటించింది లేదు.

ఒక వైపేమో మునుగోడులో పోటీచేయాలని తెలంగాణాలోని పార్టీ నేతలు ఎంతగా చెప్పినా పవన్ మాత్రం వద్దని తేల్చేశారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తమకు తెలంగాణలో జనసేనతో పొత్తు లేదని చెప్పేశారు. ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీతో పొత్తు విషయమే అయోమయంలో ఉందని అనుకున్నారు.

లక్ష్మణ్ ప్రకటనతో ఆ కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయింది. కాబట్టి తెలంగాణాలో పవన్ యధేచ్చగా రాజకీయం చేయచ్చు. ఇందులో భాగంగానే మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయాలని మళ్ళీ పార్టీ నేతల నుండి ఒత్తిళ్ళు మొదలయ్యాయట. మరీ పరిస్థితుల్లో పవన్ ఏమిచేస్తారో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News