ఈ ఎంపీల‌ను బాబు ఏం చేస్తారు?

Update: 2021-09-05 10:30 GMT
2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిన టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య సాధించాల‌ని ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. అందుకే మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఆ దిశ‌గానే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇంఛార్జ్‌ల‌ను నియ‌మిస్తూ సాగుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల వ్య‌వ‌హారశైలి ఇబ్బందిగా మారింద‌నే విష‌యం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌, కేశినేని నాని, రామ్మోహ‌న్ నాయుడు ఎంపీలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ల ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ అధినేత బాబుకు లేఖ‌లు రాసిన‌ట్టు తెలిసింది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ధాటిని త‌ట్టుకుని మ‌రీ శ్రీకాకుళం నుంచి రామ్మోహ‌న్ నాయుడు, విజ‌య‌వాడ్ నుంచి నాని, గుంటూరు నుంచి జ‌య‌దేవ్ వ‌రుస‌గా రెండోసారి ఎంపీలుగా గెలిచారు. వీళ్లంతా క‌లిసి క‌ట్టుగానే ఉంటూ పార్ల‌మెంటులో ఏపీ స‌మ‌స్య‌ల‌పై కేంద్రాన్ని నిల‌దీస్తున్నార‌ని బాబుతో పాటు ఆయ‌న కొడుకు లోకేశ్ త‌రుచుగా చెప్తూనే ఉన్నారు. కానీ పైకి చెబుతున్న ప‌రిస్థితికి పార్టీలో అంత‌ర్గ‌తంగా ఉన్న ప‌రిస్థితికి పొంత‌న లేద‌ని సీనియ‌ర్లు చెప్తున్నారు. ఈ ఎంపీలు టీడీపీ త‌ర‌పున గెలిచిన‌ట్లు.. ఆ పార్టీకి ప‌నిచేస్తున్న‌ట్లు అస‌లు భావించ‌డం లేదని అనుకుంటున్నారు. ఈ ముగ్గురిలో చూసుకుంటే రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌వ‌ర్త‌న మాత్రం ఫ‌ర్వాలేద‌ని మిలిగిన ఇద్ద‌రి వైఖ‌రి మాత్రం స‌మంజ‌సంగా లేద‌ని పార్టీ నాయ‌కులు అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

నాని ఏకంగా పార్టీ అధినేత బాబుపైనే కామెంట్లు చేయ‌డంతో ఆయ‌న వైఖ‌రి వివాద‌స్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇక జ‌య‌దేవ్ టీడీపీకి స‌హ‌క‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నా త‌న వ్య‌క్తిగ‌త అజెండానే అమ‌లు చేస్తున్నార‌ని గుంటూరు టీడీపీ నేత‌లు అంటున్నారు. రాజ‌ధానిగా అమరావ‌తి ఉద్య‌మం జోరుగా సాగిన‌పుడు పార్ల‌మెంటులో దానిపై మాట్లాడ‌టం త‌ప్పించి ఆ త‌ర్వాత ఆయ‌న గుంటూరు ముఖ‌మే చూడ‌లేద‌ని చెప్తున్నారు. త‌మ పార్టీ ఎంపీ అనే కానీ ఒక్క ప‌ని కూడా చేసి పెట్ట‌డం లేద‌ని టీడీపీ సీనియ‌ర్లు పేర్కొంటున్నారు. ఇదే విష‌యంపై విజ‌య‌వాడ‌, గుంటూరు ప్రాంతాల టీడీపీ నాయ‌కుల్లో ప‌దిమంది బాబుకు లేఖ‌లు రాశారు. వాటిపై స్పందించిన బాబు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పి ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ట్టించుకోలేద‌ని తెలిసింది. దీంతో ఇక ఈ విష‌యంపై సీనియ‌ర్ నాయ‌కులు బ‌హిరంగంగానే తేల్చుకునేందుకు సిద్ధమ‌య్యార‌ని స‌మాచారం.

ఎంపీగా గెలిచారంటే మా స‌హకారం లేకుండానే విజ‌యం సాధించారా? అని ఇటీవ‌ల గుంటూరుకు చెందిన ఓ మాజీ మంత్రి విలేక‌ర్ల ముందే వాపోయార‌ని తెలిసింది. విజ‌య‌వాడ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. ఇప్ప‌టికే ఏపీలో పార్టీ ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఈ సీనియ‌ర్ నాయ‌కుల అసంతృప్తిని చ‌ల్లార్చేందుకు బాబు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి. వెంట‌నే స్పందిస్తారా? లేదా తెగేదాకా వేచి చూస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News