పోలీసుల‌కు మందుబాబుల షాక్!

Update: 2018-09-01 16:46 GMT
మందుబాబులం మేము మందు బాబులం....మందుకొడితే మాకు మేమె మ‌గారాజులం.....తాగుబోతంటే ఎందుకంత చుల‌క‌న‌....తాగి వాగేది ప‌చ్చినిజం గ‌న‌క‌న‌.....అంటూ తాగుబోతోళ్ల గురించి గొప్ప‌గా రాశాడో సినీ క‌వి. అయిన‌ప్ప‌టికీ ఖాకీలు త‌మ‌ను చిన్న‌చూపు చూస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుకోవ‌డం...అవ‌స‌ర‌మైతే డ్రోన్ ల సాయం తీసుకొని మందుబాబుల‌ను ఛేజ్ చేయ‌డం...కేసులు రాయ‌డంతో వారంతా తెగ మ‌ధ‌న‌ప‌డిపోయారు. త‌మ‌ను ప‌ట్టుకొనేందుకు సందులు....గొందుల్లో కాపు కాస్తున్న ఖాకీల‌కు చిక్క‌కుండా ఉండేందుకు వ్యూహాలు ర‌చించారు. త‌మ లిక్క‌ర్ బ్రెయిన్ కు ప‌దును పెట్టి ఓ అద్భుత‌మైన ఐడియాను రూపొందించారు. ముల్లును ముల్లుతోనే తీయాల‌న్నట్లు....బ్రీత్ ఎన‌లైజ‌ర్ వంటి టెక్నాల‌జీతో త‌మ‌కు చెక్ పెడుతోన్న ఖాకీల‌కు ...టెక్నాల‌జీ తోనే చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే - ఈ ట్యాక్స్ పేయ‌ర్లంతా క‌లిసి మూకుమ్మ‌డిగా వాట్సాప్ గ్రూపుల‌ను ఏర్పాటు చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ - డ్రోన్ నిఘాలు ఉన్న ప్రాంతాల‌ను ఆ గ్రూపుల‌లో ఎప్ప‌టిక‌పుడు షేర్ చేస్తూ....త‌మ సంఘ స‌భ్యులు పోలీసుల‌కు దొర‌క‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు అవాక్క‌య్యారు.

కరీంనగర్‌ లో మందుబాబుల ఆగడాలు శృతిమించ‌డంతో వారికి కళ్లెం వేసేందుకు డ్రోన్ కెమెరా డ్రైవ్ లు - డ్రంక్ అండ్ డ్రైవ్ ల‌ను పోలీసులు చేప‌ట్టారు. తాగుబోతుల న్యూసెన్స్ నుంచి... కరీంనగర్ నగరవాసులను కాపాడుతున్నారు. పార్కుల వద్ద - ఇతర ఖాళీ ప్రదేశాల్లో డ్రోన్ కెమరాల ద్వారా బ‌హిరంగంగా మద్యం సేవిస్తోన్న వారిని పోలీసులు ప‌ట్టుకుంటున్నారు. దాంతో పాటు - ఏదోఒక రహదారిపై రోజూ డ్రంకెన్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. మందుబాబుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చినా మార‌క‌పోవ‌డంతో కొంత‌మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో, పోలీసులకు దొర‌క‌కుండా ఉండేందుకు మందుబాబులు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. వాట్సాప్ గ్రూప్‌ లు క్రియేట్ చేసి...పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్న ప్రాంతాలు - డ్రోన్ కెమెరాలు ఉన్న ప్రాంతం పేరుని అప్‌ డేట్ చేస్తున్నారు. దీంతో - అప్ర‌మ‌త్త‌మైన మందుబాబులు వేరే రూట్ లో ఎస్కేప్ అవుతున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో సభ్యత్వానికి రూ.2000 రుసుము కూడా నిర్ణ‌యించారు. గ్రూప్ న‌కు 4 వందల మంది చొప్పున రెండు గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ నిబంధనలను తుంగ‌లో తొక్కే వీరు....గ్రూప్ నియ‌మ‌నిబంధ‌న‌లు తు.చ త‌ప్ప‌కుండా పాటించ‌డం విశేషం. డ్రంకెన్ డ్రైవ్ మిన‌హా వేరే సమాచారం పోస్ట్ చేస్తే...200 ఫైన్ వేస్తున్నారు. ఫైన్ చెల్లించకుంటే  గ్రూప్ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.
 
కొద్ది రోజులుగా డ్రంకెన్ డ్రైవ్‌ లో కేసులు న‌మోదు కాక‌పోవ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. తమ ప‌నిత‌నంతోనే మందుబాబులు మెత్త‌ బ‌డ్డారని పోలీసులు కూడా సంబరపడ్డారు. అయితే, దాల్ మే కుచ్ కాలా హై అన్న‌ట్లు... కేసులు మరీ తగ్గిపోవడంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో - ప్ర‌త్యేక నిఘా పెట్టిన పోలీసులు..... సైబర్ క్రైం డిపార్ట్‌ మెంట్ సాయం తీసుకున్నారు. దీంతో , మందుబాబుల  గుట్టు ర‌ట్ట‌యింది. ఆ వాట్సాప్ గ్రూపుల వ్య‌వ‌హారం తెలుసుకొని పోలీసులు ఖంగుతిన్నారు. వెంట‌నే, ఆ గ్రూపుల అడ్మిన్లను అదుపులోకి తీసుకుని విచారణ చేప‌ట్టారు. కేవలం వాట్సాప్ గ్రూపుల‌కే ప‌రిమిత‌మ‌య్యారా....లేకుంటే వేరే యాప్స్ గ‌ట్రా వాడుతున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా....టెక్నాల‌జీని బీభ‌త్సంగా వాడేసిన మందుబాబుల తెలివితేట‌ల‌పై మాత్రం సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి.
Tags:    

Similar News