వాట్సాప్ కేంద్రం మాట అస్సలు వినటం లేదా?

Update: 2019-12-23 05:17 GMT
అంతకంతకూ సమస్యగా మారుతున్న పోర్నోగ్రఫీకి చెక్ చెప్పేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు సోషల్ మీడియా సంస్థలతో పాటు వాట్సాప్ లాంటి సంస్థలు సహకరించటం లేదా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇదే విషయం తాజాగా బయటకు వచ్చింది. పెనుభూతంగా మారిన పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా.. వాట్సాప్ లాంటి సంస్థల సహకారం చాలా అవసరం. కానీ.. ప్రభుత్వానికి ఈ సంస్థలేమీ సహకరించటం లేదన్న ఆరోపణను న్యాయశాఖ తాజాగా రాజ్యసభ ప్యానల్ ముందు ఉంచింది.

అశ్లీల చిత్రాలు..పిల్లల మీద ప్రభావం చూపించే వీడియోల్ని అరికట్టటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేస్తున్న అభ్యర్థనల్ని సోషల్ మీడియా.. వాట్సాప్ లు పట్టించుకోవటం లేదట. గోప్యత పేరుతో సామాజిక మాధ్యమాలు తమ మాటను వినటం లేదని న్యాయశాఖ కమిటీ ముందు తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని వెల్లడించింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఛైర్మన్ గా వ్యవహరించే రాజ్యసభలో ఈ ప్యానల్ ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ ప్యానల్ కు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో పది పార్టీలకు చెందిన14 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్యానల్ ఎదుట హాజరైన కేంద్ర న్యాయశాఖకు చెందిన అధికారులతో పాటు ఐటీ అధికారులు పాల్గొన్నారు. ఈ సంస్థల సర్వర్లు ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని.. అందువల్ల విచారణకు విఘాతం కలుగుతోందని చెబుతున్నారు.

చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలతో పాటు.. వాటిని వ్యాప్తి చేసే డార్క్ సైట్ల వ్యవస్థలపై కన్నేయటానికి వీలుగా లా ఎన్ ఫోర్స్ మెంట్ కు స్పష్టమైన అధికారాలు లేవన్న విషయాన్ని ప్యానల్ ముందుంచారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు సోషల్ మీడియా సంస్థల్ని.. వాట్సాప్ లలో అశ్లీల ఫోటోలు.. వీడియోల్నికంట్రోల్ చేయటం అంత తేలికైన విషయం కాదన్నది ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News