కేటీఆర్‌... మెట్రో భాగ్యం హైద‌రాబాదీల‌కు వ‌ద్దా?

Update: 2017-04-11 17:33 GMT
భాగ్య న‌గ‌రి హైద‌రాబాదులో మితిమీరిపోయిన కాలుష్యాన్ని త‌గ్గించ‌డ‌మే కాకుండా... ప్ర‌జ‌ల‌కు ప్ర‌యాణ సయ‌మాన్నే కాకుండా... ర‌వాణా చార్జీల‌ను భారీగా త‌గ్గించేందుకు ఉద్దేశించిన హైద‌రాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు న‌త్త‌కు న‌డ‌క‌లు నేర్పుతోంద‌న్న వాద‌న తెలిసిందేగా. తాము అధికారంలోకి వ‌స్తే... శ‌ర‌వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైద‌రాబాదీల‌కు సుఖ‌మ‌య ప్ర‌యాణాన్ని అందుబాటులోకి తెస్తామ‌ని టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది కూడా.

అంతా ఊహించినట్లుగానే టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యారు. కేసీఆర్ కుమారుడు, యువనేత‌, మొన్న‌టి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన కేటీఆర్ కూడా మంత్రివ‌ర్గంలో కీల‌క మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తెలంగాణ‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశ‌గా ప‌య‌నించేలా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతున్న కేటీఆర్‌... ప‌నితీరులో త‌న‌దైన శైలిలో దూసుకువెళుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్‌... అక్క‌డి మెట్రో రైల్లో ప్ర‌యాణించారు.

ఇక కేటీఆర్ ప‌క్క‌నే కూర్చున్న టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్‌... కేటీఆర్‌తో క‌లిసి ఓ సెల్ఫీ తీసుకుని దానిని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప‌య‌నిస్తున్న సంద‌ర్భంగా కేటీఆర్ మోములో సంతోషం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు తెలుగు మీడియాలో వైర‌ల్‌గా మారింద‌నే చెప్పాలి. ఢిల్లీ వెళ్లి అక్క‌డి మెట్రో రైల్లో ప్ర‌యాణించ‌డం బాగానే ఉన్నా... హైద‌రాబాదు మెట్రో రైలును ఎప్పుడు ప‌ట్టాలెక్కిస్తారో చెప్పండి అంటూ జ‌నం కేటీఆర్‌కు పరోక్షంగా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కే కేటీఆర్ అండ్ కో నుంచి ఎలాంటి సమాధానం వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News