ఏపీ క‌మల‌నాథులు ఎక్కడ‌?... ఆప‌త్కాలంలో అడ్రెస్ లేరే!

Update: 2021-05-12 00:30 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీకి చెందిన ఏపీ నేత‌లు నిజంగానే ఇప్పుడు అడ్రెస్ లేకుండాపోయారు. మొన్న‌టికి మొన్న తిరుప‌తి లోక్ స‌భ‌కు జ‌రిగిన ఉప ఎన్నిక సంద‌ర్భంగా రోజుల త‌ర‌బ‌డి తిరుప‌తిలో తిష్ట వేసిన ఏపీ బీజేపీ నేత‌లు... ఆ ఎన్నిక ముగియ‌గానే అడ్రెస్ లేకుండాపోయారు. అయినా ఎన్నిక‌లు ముగిశాక‌.. ఇప్పుడు వారి అడ్రెస్ తో ప‌నేముంది అంటారా? ఎందుకు లేదండీ... క‌రోనాతో అల్లాడిపోతున్న మ‌హారాష్ట్ర‌లో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత‌లు... ప్ర‌త్యేకించి మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఇప్పుడు విప‌క్షంలో ఉండి కూడా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో మాట్లాడి... త‌న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇతోదిక సాయం అందేలా చేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల అవ‌స‌రాల మేర‌కు అధికారంలో ఉంటేనే ప‌నిచేస్తామ‌న్న విష‌యాన్ని ఆయ‌న అస్స‌లు ప‌ట్టించుకోలేదు.

మ‌రి ఇప్పుడు ఏపీలో క‌రోనా విల‌య‌తాండవం చేస్తోంది క‌దా. క‌రోనా రోగుల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్ లేక‌... ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో రోగులు ప్రాణాలు వ‌దిలారు. నిన్న‌టికి నిన్న తిరుప‌తి లోని రుయా ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ అంద‌ని కార‌ణంగా ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై విప‌క్షాలు నిర‌స‌న తెలిపితే.. వారితో క‌లిసి బీజేపీకి చెందిన టీటీడీ పాల‌క‌మండ‌లి మాజీ స‌భ్యుడు భానుప్ర‌కాశ్ రెడ్డి కూడా నానా హంగామా చేసిన వైనం తెలిసిందే. మ‌రి రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన మేర ఆక్సిజ‌న్ ను స‌ర‌ఫ‌రా చేయండి అని భానుప్ర‌కాశ్ రెడ్డి కేంద్రం పెద్ద‌ల‌ను ఒక్క‌సారి అయినా అడిగారా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌రే.. భానుప్ర‌కాశ్ రెడ్డి అంటే... పార్టీలో ద్వితీయ శ్రేణి నేత కిందే లెక్క‌. మ‌రి పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న సోము వీర్రాజు గానీ, తిరుప‌తి బ‌రిలో పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారిణి ర‌త్న‌ప్ర‌భ‌, ఇక పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గంలో కీల‌క ప‌ద‌వి ద‌క్కించుకున్న కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిలు ఏమైపోయారన్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

తిరుప‌తి సీటును గెలుచుకునేందుకు రోజుల త‌ర‌బ‌డి వీరంతా తిరుప‌తిలోనే మ‌కాం వేసిన వైనం మ‌న‌కు తెలిసిందే. తిరుప‌తి బ‌రిలో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థిని నిలుపుతామంటూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నోరు తెరిచి అడిగినా... స‌సేమిరా అన్న సోము, పురందేశ్వ‌రిలు బీజేపీ అభ్య‌ర్థే బ‌రిలో ఉంటార‌ని తెగేసి చెప్పేశారు. మ‌రి ఇప్పుడు రాష్ట్రం స‌రిప‌డినంత ఆక్సిజ‌న్ లేక‌, స‌రిప‌డినంత మేర వ్యాక్సిన్ డోసులు అంద‌క రాష్ట్రం అల్లాడుతుంటే... సోము గానీ, పురందేశ్వ‌రి గానీ ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేదు. ఫ‌డ్న‌వీస్ మాదిరిగా కేంద్రం పెద్ద‌ల‌తో క‌నీసం మాట వ‌ర‌స‌కైనా రాష్ట్రం అవ‌స‌రాల‌ను ప్ర‌స్తావించిన పాపాన పోవ‌డం లేదు. బీజేపీ నేత‌ల తీరు ఇలా ఉంటే... తిరుప‌తి బ‌రిలో త‌న పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించేందుకోసం ఏకంగా రెండు ప‌ర్యాయాలు ఢిల్లీదాకా వెళ్లివ‌చ్చిన జన‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌... రాష్ట్రం అవ‌స‌రాల గురించి నోరెత్త‌క‌పోవ‌డం నిజఃగానే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News