అధికార ప్ర‌తినిధులు ఎక్కడ‌... వైసీపీ గ‌ళం వినిపించేదెవ‌రు...?

Update: 2019-10-31 06:48 GMT
అధికారంలో ఉన్న పార్టీల‌పై న‌లువైపుల నుంచి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు రావ‌డం స‌హ‌జం. ప్ర‌జ‌ల‌కు ఎన్ని ప‌నులు చేస్తున్నా.. ఏదైనా ఒక్క‌లోపం త‌లెత్తితే.. దానిని రాజ‌కీయంగా వాడుకోవ‌డం అనేది పొలిటిక‌ల్ పార్టీల‌కు స‌హ‌జం. ఈ ప‌రిస్థితి గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లోనూ క‌నిపించింది. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌లోనూ క‌నిపిస్తోంది. అయితే, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను గ‌ట్టిగా ఎదుర్కొనేందుకు, కౌంట‌ర్ వ్యాఖ్య‌లు చేసేందుకు అధికార ప‌క్షం కొంద‌రు అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మిస్తుంది.

అలా అధికార ప్ర‌తినిధులుగా నియ‌మితులైన వారు సంద‌ర్భానుసారంగా త‌మ పార్టీపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను ఖండించ‌డ‌మో.. లేక కౌంట‌ర్ వ్యాఖ్య‌లు చేయ‌డ‌మో చేసి.. పార్టీని అన్ని విధాలా కాపాడే ప్ర‌య‌త్నం చేస్తారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వైసీపీలోనూ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మించారు. దాదాపు 30 మంది అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మించారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌రిద్ద‌రు (సాధార‌ణంగా రోజూ మీడియాలో క‌నిపించేవారే) త‌ప్ప మిగిలిన వారు ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రాలేదు.

స‌రే! సంద‌ర్భం లేదు కాబ‌ట్టి.. ఎవ‌రూ ముందుకు రాలేద‌ని అనుకున్నా.. తాజాగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కూడా వారు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నిన్న‌టికి నిన్న సాక్షాత్తూ.. సీఎం జ‌గ‌నే త‌మ పార్టీ వారిని ఆదేశించారు. ఇసుక విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ ఖండించాల‌ని పిలుపు నిచ్చారు. ఎవ‌రు ఎలాంటి విమ‌ర్శ చేసినా వెంట‌నే రంగంలోకి దిగి వాస్త‌వ ప‌రిస్థితిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని, ప్ర‌తిప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని కూడా జ‌గ‌న్ పిలుపు నిచ్చారు.

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. జ‌గ‌న్ చెప్పిన త‌ర్వాత కూడా ఏ ఒక్క అధికార ప్ర‌తినిధి బ‌య‌ట‌కు వ‌చ్చి... ప్ర‌భుత్వ విధానాన్ని వివ‌రించింది లేదు. వాస్త‌వానికి అధికార ప్ర‌తినిధుల్లో ఫైర్ బ్రాండ్లు లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా వంటి వారు ఎక్క‌డా మాట్లాడ‌క‌పోవ‌డం వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. అస‌లు ఏమైంది? ఎందుకు వీరంతా మౌనంగా ఉన్నార‌ని అని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఎప్ప‌టికి లైన్‌లోకి వ‌స్తారో చూడాలి.
Tags:    

Similar News