కిమ్ ఎత్తు .. సింగ‌పూర్ అడ్ర‌స్

Update: 2018-06-12 14:30 GMT
ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ అణు ఆయుధాల‌తో గ‌త కొన్నేళ్లుగా మామూలు భ‌యాందోళ‌న‌లు సృష్టించ‌లేదు. అమెరికాతో క‌య్యానికి కాలు దువ్వి ఏ క్ష‌ణం ఏ క్షిప‌ణి ఎటు వైపు ప్ర‌యోగిస్తాడో అని ప్ర‌జ‌లు బెంబేలెత్తేలా ప్ర‌వ‌ర్తించాడు. అమెరికా పౌరులు అయితే కొన్నాళ్లు కంటి మీద కునుకులేకుండా గ‌డిపారంటే ఆశ్చ‌ర్యపోన‌క్క‌ర్లేదు. అయితే అంత‌లా గ‌ర్జించిన కిమ్ నేరుగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది.

అది కూడా త‌న దేశం ఉత్త‌ర కొరియా - ట్రంప్ ఉండే అమెరికా గ‌డ్డ మీద కాకుండా సింగ‌పూర్ లో స‌మావేశం కావ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తించింది. ఇక అమెరిక‌న్లు అయితే పెద్ద ఉత్కంఠ‌నే ఎదుర్కొన్నార‌ని వారు ఇంట‌ర్నెట్ లో వెతికిన ప‌లు ప్ర‌శ్న‌లే తేట‌తెల్లం చేస్తున్నాయి.

సింగ‌పూర్ ఎక్క‌డ ఉంది ? అది అస‌లు దేశ‌మేనా ? ఉత్త‌ర కొరియా ఎక్క‌డ ఉంది ?  సింగ‌పూర్ - ఉత్త‌ర కొరియాకు సంబంధం ఏంటి ? ఇది చైనాదా ? ఉత్త‌ర కొరియాదా ? జ‌పాన్ దా ? కిమ్‌ జాంగ్‌ ఉన్ ఎత్తు ఎంత ? అత‌నికి అస‌లు ఇంగ్లీష్ మాట్లాడ‌డం వ‌చ్చా ? అని గూగుల్ లో వెతికిన‌ట్లు గూగుల్ ట్రెండ్స్ తేట‌తెల్లం చేస్తున్నాయి. కిమ్ తో అమెరికా అధ్య‌క్షుని స‌మావేశం నేప‌థ్యంలో వారు వీటి గురించి తెలుసుకునేందుకు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు.

త‌న‌కు అడ్డొస్తున్నార‌ని అనేక మందిని అంత‌మొందించిన కిమ్ సింగ‌పూర్ లో భేటీకి ఒప్పుకోవ‌డం విశేష‌మే. ఆయ‌న భేటీకి చైనా పంపిన విమానం 747లో రావ‌డంతో చైనా - ఉత్త‌ర కొరియా సంబంధాల మీద ఆస‌క్తి రేపుతుంది. త‌న దేశాధ్య‌క్షుల‌కు త‌ప్ప మిగిలిన వారికి ఇలా చైనా పంప‌డం ఎన్న‌డూ లేదు. ఇక సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కిమ్ త‌న కోసం మొబైల్ టాయిలెట్ ను వెంట తెచ్చుకున్నాడు. ప్ర‌త్య‌ర్ధులు త‌న గురించి తెలుసుకోకుండా వ్య‌ర్ధాల‌ను ప్ర‌త్యేకంగా నిర్మూలించే ఈ టాయిలెట్ తెచ్చుకున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News