రేప్ కేసు వైసీపీ ఎంపీపై చ‌ర్య‌లేవి జ‌గ‌న్‌?

Update: 2019-12-10 04:00 GMT
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల తొలిరోజే... సీఎం వ‌ర్సెస్ ప్ర‌తిప‌క్ష నేత అన్న‌ట్లుగా ఏపీలో విమ‌ర్శ‌లు- ప్ర‌తి విమ‌ర్శ‌లు సాగాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు విరుచుకుప‌డ్డారు. ఆడపిల్లలకు రక్షణ ఉండాల్సిందే. కఠినంగా వ్యవహరించే ప్రభుత్వం ఉండాలి..అందుకు ఒక కఠినమైన చట్టం ఉండాలని చంద్ర‌బాబు అన్నారు. ఈ సంద‌ర్భంగా హిందూపురం ఎంపీపై అత్యాచార కేసు ఉంద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. వైకాపా సర్కార్‌ అధికారంలోకి వచ్చాక 12,653 మంది మహిళలపై అత్యాచారాలు, దాడులు, వరకట్న వేధింపుల ఘటనలు జరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు.


రాజకీయంగా పలుకుబడి ఉన్నా సరే..సమాజంలో చట్టాల్లో ఉండే లొసుగులను చూసుకునే ఏదో ఒక విధంగా ఆడపిల్లలను ఇబ్బంది పెట్టాలని అనుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మంది అధికార పార్టీ నేతలు మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

 రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందని..ముందుగా పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఒంగోలు..అనంతపురం..తూర్పు గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు చేసిన అఘాయిత్యాలను చంద్రబాబు ప్రస్తావించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో..ఇక్కడ ఉన్న ఉన్న చట్టాలను అధ్యయనం చేయాలని, గ‌తంలో జరిగిన సంఘటలను పొందుపర్చాల‌న్నారు.  తనపైనా, తన కుటుంబంపైనా.. అటు సభలో లేని పవన్‌పైనా, పవన్ కుటుంబంపైనా అధికార పార్టీ సభ్యులు అసభ్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, తెలుగుదేశం పార్టీ నేత‌లు సైతం వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పార్టీ అధికార‌ప్ర‌తినిధి పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ...వైసీపీ నేత‌లే మ‌హిళ‌ల ప‌ట్ల ఆకృత్యాల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు అని పేర్కొన్నారు. ఎంపీ మాధ‌వ్‌తో పాటుగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వరకట్న వేధింపుల కేసులో నిందితులుగా ఉంటే వారికి వైసీపీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చింద‌ని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా అధికారిని‌ అర్ధరాత్రి బెదిరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాసు మహేష్ రెడ్డి అనుచరుడు ఒక మహిళపై..అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తే వారిపై ఇంతవరకు ఎటువంటి కేసూ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు మ‌హిళ‌ల ర‌క్ష‌ణ గురించి మాట్లాడ‌టం చిత్రంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News