ఎలక్షన్ కమీషన్ను ఉద్యోగులు బహిష్కరించారా ?

Update: 2021-01-20 13:30 GMT
రాష్ట్రంలో గతంలో ఉద్యోగుల విషయంలో ఎప్పుడూ జరగని విచిత్రాలు జరుగుతున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమీషన్లో పనిచేయటానికి ఉద్యోగులెవరూ ఇష్టపడటం లేదు. కమీషన్లో పనిచేయటానికి నిమ్మగడ్డ ముగ్గురు ఉద్యోగులను ఎంపిక చేస్తే వాళ్ళు ముగ్గురూ విధుల్లో చేరటానికి నిరాకరించారు. ఇది ఒక విధంగా కమీషన్ను ఉద్యోగులు బహిష్కరించినట్లుగానే భావించాలి. నిజంగా ఇది దురదృష్టకరమైన డెవలప్మెంటే అయినా సమస్యంతా కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుండే మొదలైందన్న విషయం మరచిపోకూడదు.

ఎలక్షన్ కమీషన్లో పనిచేసే ఉద్యోగులందరు కమీషనర్ ఆధీనంలోనే పనిచేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కమీషనర్ తో పాటు మిగిలిన ఉద్యోగులను కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. కమీషనర్ ను ఎంపిక చేసిన ప్రభుత్వం నియామకం కోసం గవర్నర్ కు ప్రతిపాదన పంపుతుంది. ప్రభుత్వం నుండి వచ్చిన పేరునే గవర్నర్ కూడా ఆమోదిస్తారు. ఇక మిగిలిన ఉద్యోగుల్లో పై స్ధాయి అధికారులను చీఫ్ సెక్రటరీ సిఫారసుతో కమీషనర్ తీసుకుంటారు.

మామూలుగా జరిగే తంతు కాబట్టి డిప్యుటేషన్ పై కమీషన్లో పనిచేసే ఉద్యోగుల వ్యవహారాలేవీ బయటకు తెలీవంతే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి కమీషనర్ నిమ్మగడ్డకు వివాదం మొదలైంది. ఆ వివాదం చిలికి చిలికి గాలివానలాగ తయారైంది. దాంతో తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులపై నిమ్మగడ్డ యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టారు.

మొన్నటికి మొన్న జాయింట్ డైరెక్టర్ సాయికుమార్ ను ఉద్యోగంలో నుండే తీసేశారు. అలాగే కమీషన్లో కార్యదర్శిగా పనిచేస్తున్న వాణీమోహన్ను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. నిజానికి సాయికుమార్ ను తీసేసే అధికారం నిమ్మగడ్డకు లేదు. అలాగే వాణీమోహన్ను సరెండర్ చేయటం కూడా తప్పే. ఉద్యోగుల విషయంలో తనకేమన్నా అభ్యంతరాలుంటే ఆ విషయాన్ని చీఫ్ సెక్రటరీకి చెప్పుకోవాలంతే. కానీ తన దగ్గర పనిచేస్తున్నారన్న ఏకైక కారణంతో ఉద్యోగులపై ఇష్టమొచ్చినట్లు యాక్షన్ తీసుకుంటున్నారు.

దీంతో కమీషన్లో పనిచేయటానికి ఉద్యోగులెవరూ ఇష్టపడటం లేదు. తాజాగా కమీషన్లో పనిచేయటానికి 12 మంది ఉద్యోగులను ఎంపిక చేసి జాబితాను కమీషన్ కు పంపారు. వీరిలో ముగ్గురిని నిమ్మగడ్డ ఫైనల్ చేశారు. అయితే తాము కమీషన్లో పనిచేసేది లేదని ఆ ముగ్గురూ చీఫ్ సెక్రటరీకి చెప్పేశారు. దాంతో చేసిన ఎంపికను చీఫ్ సెక్రటరీ ఉపసంహరించుకున్నారు. ఎవరిని అడిగినా తాము పనిచేయమని చెప్పేస్తున్నారు. దాంతో ఏమి చేయాలో చీఫ్ సెక్రటరీకి అర్ధం కావటం లేదు. తమ ఉద్యోగుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరినీ కమీషన్లో నియమించవద్దని ఉద్యోగుల సంఘం నేతలు చీఫ్ సెక్రటరీని కోరటం కొసమెరుపు.


Tags:    

Similar News