టీటీడీ చైర్మన్‌ పదవి ఈ ముగ్గురిలో ఎవరికి?

Update: 2022-12-28 13:59 GMT
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్‌ బోర్డును పునర్నిర్మించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించుకున్నారని సోషల్‌ మీడియాలో గాసిప్స్‌ షికారు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయం నిజమేనని వైఎస్సార్‌సీపీ వర్గాలు సైతం ధ్రువీకరించినట్టు టాక్‌ నడుస్తోంది. ప్రస్తుత టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా ఉన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం మాత్రమే ఉంది.

ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సంవత్సరంలో రాజకీయాలపై పూర్తి సమయం దృష్టి పెట్టాల్సి ఉన్నందున.. ఆయనను పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయించారని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి సైతం తనను టీటీడీ చైర్మన్‌ గా తప్పించాలని కోరినట్టు సమాచారం.

2021 జూన్‌లో తన మొదటి పదవీకాలం రెండేళ్లు పూర్తయిన తర్వాత 2021 ఆగస్టులో మరోసారి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం జూలై 2023 వరకు ఉంది,

అయితే కీలకమైన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా వైవీ సుబ్బారెడ్డి ఉండటంతో జోడు గుర్రాల స్వారీ చేయడం కష్టమవుతుందనే భావనలో సీఎం జగన్‌ ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగిశాక జనవరి రెండో వారంలో ప్రస్తుతం ఉన్న బోర్డును రద్దు చేసి మళ్లీ కొత్త బోర్డును ఏర్పాటు చేస్తారని సమాచారం.

ఈ నేపథ్యంలో కొత్త ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ను కనుగొనే కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో పలువురు నేతల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

టీటీడీ ట్రస్టు బోర్డు కొత్త చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి పేరును జగన్‌ పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భూమన గతంలో జగన్‌ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఈ పదవిలో ఉన్నారు.

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న మరో పేరు.. చంద్రగిరి ఎమ్మెల్యే, బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి. ఈయన జగన్‌కు గట్టి విధేయుడు.

అయితే ఆ పదవిని రెడ్డి సామాజికవర్గానికి కాకుండా బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంలో జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌ ఎమ్మెల్సీ, విప్‌ జంగా కృష్ణమూర్తికి ఇవ్వవచ్చు. జంగా యాదవ సామాజికవర్గానికి చెందినవారు.
Tags:    

Similar News