డబ్ల్యూహెచ్ఓ గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత మంచిదే

Update: 2020-09-11 11:30 GMT
ఎప్పుడెప్పుడు కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ వస్తుందా? అని యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ... ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత నిజంగానే నిరాశ కలిగించే అంశమే. అయితే ఈ విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, ఇది కరోనా వైరస్ పై జరుగుతున్న పరిశోధనలకు ఓ మేలుకొలుపు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆసక్తికర ప్రకటన చేసింది. వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిచిపోతే... ఈ ప్రయోగాలు ఎక్కడికక్కడ నిలిచిపోతే... మేలుకొలుపు ఎలా అవుతుందన్న ప్రశ్న ఉదయించినా... కాస్తంత లోతుగా పరిశీలన చేస్తే... డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటన నిజమేనని తెలియక మానదు.

ఈ దిశగా డబ్ల్యూహెచ్ఓ ఏమన్నదన్న విషయానికి వస్తే.. ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఒక మేల్కొలుపు మాత్రమేనని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి మరింత సిద్ధంగా ఉండాలని ఆమె వెల్లడించారు. ఇక దీనిపై పరిశోధకులు కూడా నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని సౌమ్య వివరించారు. మొత్తంగా ఆక్స్ ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలు నిలిచిపోవడం మనల్ని నిరాశకు గురి చేసినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే... నిజంగానే ఈ ప్రయోగాల నిలిపివేత మేలుకొలుపేనని చెప్పక తప్పదు.

మరోవైపు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ మరో ఆసక్తకర వాదన వినిపించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత దేశాలు, కంపెనీల మధ్య పోటీకి ఎంతమాత్రం నిదర్శనం కాదని చెప్పిన ఆయన... ప్రజల ప్రాణాలను రక్షించుకోవడంపైనే మనమంతా దృష్టి సారించాలని సూచించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలిక నిలిపివేత వ్యాక్సిన్ తయారీ కంపెనీలు లేదా దేశాల మధ్య పోటీ కాదని అన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఇప్పుడు వైరస్‌పైనే పోటీ అని ఆయన స్పష్టం చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారా త్వరగా వైరస్ సోకిన వారిని గుర్తించడంతో ముప్పును చాలావరకు తగ్గించవచ్చని ఆయన సూచించారు.
Tags:    

Similar News