హూ ఈజ్ షర్మిల.... ఢిల్లీ న్యూస్!

Update: 2022-12-08 07:52 GMT
షర్మిల ఎవరు. అవును ఎవరు. ఆమె తెలుగు జనాలకు దివంగత నేత మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె గా పరిచయం కావచ్చు. ఆమె జగనన్న వదిలిన బాణంగా ఏపీ జనాలకు తెలియవచ్చు. వైఎస్సార్టీపీ పార్టీని పెట్టి పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి కొంతమంది తెలంగాణా జనాలకు తెలిస్తే తెలియవచ్చు. అంతకు మించి పొలిటికల్ గా అమె ప్లేస్ ఏంటి అన్నదే కదా అసలైన ప్రశ్న. షర్మిలకు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసారా, ఆ వార్త ఎలా వచ్చింది ఆమె ఎవరు అన్నది ఇపుడు ప్రధానమంత్రి కార్యాలయం నుంచే వస్తోందిట. హూ ఈజ్ షర్మిల అని వారు అనుకుంటున్నారు అని ఢిల్లీ కబురు చెబుతున్న మాట.

అంతే కాదు ఆమెది ఏ పార్టీ. ఆమె రాజకీయ నాయకురాలిగా ఏమి సాధించారు. తెలంగాణాలో ఆమెకు ఉన్న ఓటు బ్యాంక్ ఏంటి ఇవన్నీ కూడా ప్రశ్నలే. వాస్తవానికి అవన్నీ నిజాలే. ఆమె ఒక మాజీ సీఎం కుమార్తె. ఒక ప్రస్తుత సీఎం కి చెల్లెలు అయినంతమాత్రాన రాజకీయ నాయకురాలు గా ప్రఖ్యాతి పొందలేరు కదా. ఆమె వద్ద డబ్బు ఉంది కాబట్టి పాదయాత్ర చేస్తున్నారు. దాని మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి.

రోజుకు రెండు నుంచి మూడు వందల వరకూ డబ్బులు ఒక్కొక్కరికి ఇచ్చి పాదయాత్రలో వెంట తిప్పించుకుంటున్నారని, టీయారెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఆమె పాదయాత్రకు రోజుకు ఏకంగా ఇరవై లక్షలు ఖర్చు అవుతోంది అని వారే విమర్శలు సంధించారు. అంటే ఆమె వెంట నడిచేందుకు జనాలు లేరు, ఆమెను ఎవరూ అనుసరించడంలేదు అని అంటున్నారు.

ఇక ఆమె పార్టీ గుర్తు ఏంటి అంటే కూడా జవాబు లేదు. అలాగే ఆమె పార్టీని తెలంగాణా రాజకీయాల్లో మెయిన్ స్ట్రీం పాలిటిక్స్ చేస్తున్న వారు పెద్దగా పట్టించుకోవడంలేదు. తెలంగాణాలో చాలా పార్టీలు ఉన్నాయి. అందులో ఎవరికీ పేరూ ఊరు తెలియని పార్టీలు అనేకం ఉన్నాయి. వాటిలో షర్మిల పార్టీ కూడా ఒకటి అని అంటున్నారు. ఇక చూస్తే పంచాయతీ వార్డు మెంబర్ కూడా ఆమె పార్టీ నుంచి లేరు.

అదే విధంగా చూస్తే షర్మిల పార్టీలో ఆమె తప్ప మరో నాయకుడు లేరు. ఇందిరా శోభన్ అని ఒక కీలక మహిళా నేత గతంలో ఉండేవారు. అయితే ఆమె షర్మిల వైఖరి నచ్చక బయటకు వెళ్ళిపోయారు. ఆమె ఇపుడు ఆప్ పార్టీకి తెలంగాణా ఇంచార్జిగా ఉన్నారు. ఆమె ఉద్యమాలు చేసి ఉన్న నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. షర్మిల విషయానికి వస్తే ఆమె తెలంగాణా ఉద్యమంలో లేరు. అలాగే ఆమె ఫక్తు రాయలసీమ వాసి అని ఆంధ్రా మూలాలు ఉన్న వారు అని చాలా లైట్ గా తెలంగాణా నాయకులే కాదు తెలంగాణా సమాజం కూడా తీసుకుంటోంది.

ఇక ఆమెను టీయారెస్ పట్టించుకుంటోందని, ఆమె రాజకీయాన్ని ఆమె వెనక బలాన్ని చూసి వణికిపోతోందని ఏవేవో ఊహించుకుంటే అదంతా భ్రమ తప్ప మరేమీ కాదని అంటున్నారు. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు నాయకులు ఊరుకున్న క్యాడర్ మండిపోయి గొడవ చేస్తుంది. అలా జరిగిందే నర్సంపేట లో జరిగిన వివాదం. ఆ తరువాత ఆమె అరెస్ట్ అయ్యారు. ఇక హైదరాబాద్ లో ఆమె అరెస్ట్ కూడా పోలీసుల అతి ఉత్సహం వల్ల కొంత హైలెట్ అయింది. అంతవరకు తప్పించి ఆమె బలమైన నాయకురాలు అని తెలంగాణలో టీయారెస్ ని ఢీ కొట్టే లీడర్ అని ఎవరూ అనుకోవడం లేదు అంటున్నారు.

అయితే తెలంగాణాలో షర్మిల పార్టీకి అంత శక్తి ఉందని, ఆమె మొత్తం రాష్ట్రంలో చక్రం తిప్పే కీలక నేత అని ఎవరూ భావించడం లేదు అంటున్నారు. ఇదిలా ఉండగా తాను సొంతంగా పార్టీ పెట్టుకున్నది సీఎం కావాలనుకుంటున్నట్లుగా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను కావాల్సివస్తే కాంగ్రెస్ బీజేపీలోలో చేరితే తనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించరా అని ఆమె ఆ మీడియా ఇంటర్వ్యూలో ప్రశించారు.

అయితే అది అసలు కుదురుతుందా అన్నది కూడా చూడాలి. చాలా మంది నాయకులు బీజేపీలో చేరారు. అందులో మాజీ మంత్రులు ఉన్నారు. అదే విధంగా ఎంతో మంది పెద్ద నాయకులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ లో చూస్తే నాయకులకు కొరతే లేదు, సీఎం క్యాండిడేట్లు అర డజన్ కి పైగా ఉంటారు. మరి తానే సీఎం క్యాండిడేట్ గా ఆయన పార్టీలు పిలిచి పీట వేస్తారు అని షర్మిల భావిస్తున్నారు అంటే అతిగా ఊహించుకుని మాత్రమే అని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే షర్మిల విషయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా ప్రచారం మాత్రమే సాగుతోంది అంటున్నారు. దానికి ఉదాహరణే హూ ఈజ్ షర్మిల అని ఢిల్లీల అనుకోవడమే అంటున్నారుట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News