2022లో జొమాటో మెచ్చిన బెస్ట్ కస్టమర్ ఎవరంటే?

Update: 2022-12-28 23:30 GMT
చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో క్యాష్ ఉంటే చాలు ఏదైనా మన కాళ్ళ వద్దకే వచ్చి చేరుతోంది. కొన్నేళ్లుగా ఆన్ లైన్ వ్యాపారానికి గిరాకీ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు తమ వస్తువులన్నీ ఆన్ లైన్ ద్వారా డెలివరీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

కోరుకున్న వస్తువు ఇంటికే నేరుగా క్షణాల్లో వచ్చి చేరుతుండటంతో వినియోగదారులు కూడా ఆన్ లైన్లోనే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆన్ లైన్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ లాంటి పెద్ద వస్తువులను మాత్రమే సంస్థలు డెలివరీ చేశాయి. కానీ నేటి నేడు పరిస్థితులు మారిపోయాయి.

ఒకే ఒక్క వంకాయను ఆన్ లైన్ లో కొనుగోలు చేసినా కూడా తమ సంస్థ డెలవరీ చేస్తుందంటూ కొన్ని కంపెనీలు ప్రకటనలు సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా ఆన్ లైన్ లో దొరకని వస్తువు.. డెలివరీ చేయని ప్రదేశమంటూ లేదన్నట్లు పరిస్థితులు మారిపోతున్నాయి.

ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడంలో జొమాటోకు మంచి పేరుంది. వినియోగదారులు తనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ ఆన్ లైన్లో కొనుగోలు చేయగానే జొమాటో బాయ్స్ నిమిషాల్లో కస్టమర్లకు చేరవేస్తున్నారు. దీనికితోడు ఆకర్షణీయమైన ఆఫర్లతో జొమాటో వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. దీంతో ఆన్ లైన్లో ఫుడ్ కొనుగోలు చేసేవారు ఎక్కువగా జోమాటో వైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలో జొమాటో 2022 సంబంధించి తన వార్షిక నివేదికను వెల్లడించింది. ఈ ఏడాదిలో ఢిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తి ఏకంగా 3వేల 340 ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడని పేర్కొంది. ఈ ఏడాదిలో సగటున రోజుకు తొమ్మిది చొప్పున ఫుడ్ ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో అంకుర్ ను 2022 సంవత్సరానికి 'ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ'గా జొమాటో గుర్తిస్తున్నట్లు తన వార్షిక నివేదికలో ప్రకటించింది.

ఈ ఏడాదిలోనూ అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న ఫుడ్ గా బిర్యానినే నిలిచిందని జొమాటో పేర్కొంది. 2022లో ప్రతీ నిమిషానికి 186 బిర్యానీల చొప్పున కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చారని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో పిజ్జా నిలిచింది. ఈ ఏడాదిలో ప్రతీ నిమిషానికి 139 పిజ్జాల చొప్పున ఆర్డర్లు వచ్చినట్లు జొమాటో తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి జొమాటో యాప్ లోని ప్రోమో కోడ్ లను ఉపయోగించి 2.43లక్షలు సేవ్ చేశాడని పేర్కొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News