10 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులు.. ముగ్గురిలో ఎవరు?

Update: 2020-07-31 12:10 GMT
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా.. సోనియాగాంధీకి మరో 10 రోజులు మాత్రమే గడువు ఉంది. గత ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆగస్ట్ 10వ తేదీతో ఈ పదవి ముగియనుంది. ఈ గడువులోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకుంటారు, రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు చేపడతారా లేక సోనియా గాంధీనే మళ్లీ పూర్తి బాధ్యతలు తీసుకుంటారా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి విషయంలో క్లారిటీ లేకపోవడం ఇతర పార్టీలకు ఆయుధంగా మారుతోంది. అలాగే ఈ కీలక పదవి సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీకి, రాహుల్ గాంధీ నుండి సోనియాగాంధీకి... కేవలం కుటుంబానికే పరిమితమైందనే విమర్శలు ఇతర పార్టీల నుండి ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు అనేది పెద్ద ప్రశ్నే కాదనేది చాలామంది వాదన. తల్లీకొడుకుల్లో ఎవరో ఒకరి చేతుల్లోనే ఉంటుందని, కొత్తవారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఆ కుటుంబానిదే అంటున్నారు.

సోనియా లేదా రాహుల్ గాంధీ చెబితే తప్ప ఆ పార్టీ అధ్యక్ష పదవికి ఇతరులు పోటీ చేసే అవకాశాలు లేవు. అంతకుముందు అనారోగ్యం కారణంగా సోనియా అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించారు. ఆ తర్వాత రాహుల్ 2019 ఎన్నికల్లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దీంతో సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. ఏప్రిల్ నెలలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించారు. అయితే రాహుల్ గాంధీ పట్టువీడకపోవడం, కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.

ప్రస్తుతం సోనియా అనారోగ్యంతో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలు యాక్టివ్‌గా నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ తిరిగి బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ కేడర్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ మరింత పరిపక్వత సాధించారని, ఆయననే ఎన్నుకోవాలని కోరుతున్నారు. నిన్న ఎంపీలతో జరిగిన సమావేశంలోను దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాలన్నారు. మరికొందరు నాయకులు ప్రియాంక గాంధీ వైపు మొగ్గు చూపుతున్నారు.
Tags:    

Similar News