టీడీపీలో రాజమండ్రి ఎంపీ టిక్కెట్ ఎవరికి?

Update: 2019-02-25 14:53 GMT
తెలుగుదేశం పార్టీ టిక్కెట్లకు చంద్రబాబు సర్వేలే ప్రధాన ఆధారమవుతున్నాయి. అందులో భాగంగానే చంద్రబాబు సన్నిహితుడు మాగంటి మురళీ మోహన్‌కు కూడా ఇప్పుడు టిక్కెట్ డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీ మోహన్‌ కు మళ్లీ అక్కడి టిక్కెట్ వస్తుందా రాదా అన్నది తూర్పుగోదావరి జిల్లాలో - తెలుగుదేశంలో కూడా చర్చనీయంగా మారింది.
   
ఐవీఆర్ ఎస్ సర్వేల రేటింగ్‌ లో మురళీమోహన్‌ కు స్కోర్ తక్కువగా వచ్చిందని సమాచారం. అదేసమయంలో స్థానిక టీడీపీ నేతలు - శ్రేణుల నుంచి కూడా ఆయన పట్ల సానుకూలత లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో రాజమండ్రి లోక్ సభ సీటుకు టీడీపీ నుంచి ఎవరికి టిక్కెటిస్తారన్నది ఇప్పుడు అక్కడి నేతలను తొలిచేస్తున్న ప్రశ్న.
   
మరోవైపు మాగంటి తనకు టిక్కెట్ రానిపక్షంలో తన కోడలు మాగంటి రూపకు టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. మురళీ మోహన్ కుమారుడు జయభేరీ సంస్థ డైరెక్టర్ అయిన రామ్మోహన్ భార్యే ఈ రూప. ఏపీ - తెలంగాణ సహా మారిషస్ - మాల్దీవులు - శ్రీలంకలో పలు కార్యక్రమాలు చేపడుతుంటారు. సోషల్ ఎంటర్‌ ప్రెన్యూవర్‌ గా చెప్పే రూప గత రెండేళ్లుగా రాజమండ్రి లోక్ సభ స్థానం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పలు రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
   
ఏపీ ప్రభుత్వం నుంచి ఆమె సామాజిక కార్యక్రమాల పేరిట స్థలం తీసుకున్నారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. కాగా రూపది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆమె తాత గుడివాడకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు మామ మురళీమోహన్ కూడా టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నారు. మురళీ మోహన్‌ కు ఈసారి టికెట్ రాకుంటే రూపకు ఇస్తారన్న ప్రచారం తెలుగుదేశం వర్గాల్లో జరుగుతోంది.


Tags:    

Similar News