రూ.160 కోట్లను ఎవరు కడతారా? ఏపీ ప్రభుత్వానికి బాబు సూటిప్రశ్న

Update: 2021-05-23 09:30 GMT
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ ప్రభుత్వం పైనా.. సీఎం జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత చంద్రబాబు. ఆయన నోరు విప్పారంటే..పాయింట్ కొంత.. రాజకీయం మరింత అన్నట్లు ఉంటుందన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా తాజాగా నిర్వహించిన ఆన్ లైన్ ప్రెస్ మీట్ లో ఆయన పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా మాట్లాడటం గమనార్హం. ఆయన వేలెత్తి చూపించిన విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను ఎనిమిది రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మౌఖిక ఆదేశాల్ని ప్రామాణికంగా ఏపీ ఎన్నికల కమిషనర్ తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ మాటతో.. సుప్రీంకోర్టు తీర్పును ఖేఖాతరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆమెకు ఒక్క నిమిషం కూడా ఎన్నికల కమిషనర్ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.

ఇంగ్లిషు చదవటం.. రాయటం.. వచ్చిన సాధారణ వ్యక్తులకూ సుప్రీంకోర్టు తీర్పు తేలిగ్గా అర్థమవుతుందని.. రాష్ట్రానికి సీఎస్ కు పని చేసిన వ్యక్తికి ఆ మాత్రం అర్థం కాదా? అని హైకోర్టు ఆక్షేపణను గుర్తు చేశారు. ‘ఆమె ఉద్యోగం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రూ.160 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్నికల సంఘానికి స్వతంత్ర సంస్థగా వ్యవహరించే అధికారం రాజ్యాంగం కల్పించింది. ఎన్నికల రద్దుతో వ్రధా అయిన రూ.160 కోట్లు ఎన్నికల కమిషనర్ కడతారా? ముఖ్యమంత్రి కడతారా? సుప్రీంకోర్టు ఉత్తర్వులకే దిక్కు లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటి?’’ అని సూటిగా ప్రశ్నించారు.

ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన రోజే తమ పార్టీ తరఫున వర్ల రామయ్య వెళ్లి.. సుప్రీం తీర్పును పరిగణలోకి తీసుకొని వెంటనే ఎన్నికల పెట్టొద్దని కోరారని.. అయినప్పటికీ ఆమె సుప్రీం తీర్పునను ఉల్లంఘించారన్నారు. ఎన్నికల రద్దు కారణంగా వేస్ట్ అయిన రూ.160 కోట్ల ప్రజాధనంపై చంద్రబాబు లేవెత్తిన పాయింట్ సబబే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News