క్వీన్ మరణం వేళ.. కోహినూర్ ఇప్పుడు ఎవరి సిగపైకి?

Update: 2022-09-09 14:17 GMT
70 ఏళ్ల సుదీర్ఘ పాలన అనంతరం శాశ్విత నిద్రలోకి జారుకున్నారు బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2. ఇంతకాలం ఎలిజిబెత్ ధరించిన కిరిటంలోని అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎవరికి వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాణి మరణంతో ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ 3ను రాజుగా.. 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరిస్తారు. ఇక.. ఆయన సతీమణి కెమిల్లా (డచెస్ ఆఫ్ కార్న్ వాల్) కు రాణి హోదా దక్కనుంది.

అంటే.. కోహినూర్ తో పొదిగి ఉన్న ఎలిజిబెత్ కిరీటం కెమిల్లాకు వెళ్లనుంది. తన 70 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఈ ఏడాది బ్రిటన్ లో ప్లాటినం జూబ్లీ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి రాణి ప్రసంగించారు.ఆ సందర్భంగా ఇచ్చిన సందేశంలో తన కోడలు కెమిల్లానే తదుపరి రాణిగా ఆమె తన ఆకాంక్షను వ్యక్తం చేయటం తెలిసిందే. దీంతో ఆమెకే కిరీట ధారణ జరుగుతుందని చెవుతున్నారు.

1937లో కింగ్ జార్జ్ 6 పట్టాభిషేక వేళ ఆయన సతీమణి కోసం ప్లాటినం కిరీటాన్ని రూపొందించారు.అందులోనే కోహినూర్ ఉంది. ఆ తర్వాతి కాలంలో క్వీన్ ఎలిజిబెత్ కు చేరింది. ఇప్పుడు ఆమె నుంచి కెమిల్లాకు చేరుతుంది. 105.6 క్యారెట్ల వజ్రంగా.. దీన్ని 14వ శతాబ్దంలో గుర్తించారు.

కొందరు ఏపీలోని గుంటూరుజిల్లాలో దొరికినట్లుగా చెబితే.. మరికొందరు తెలంగాణ ప్రాంతంలో లభించిందని చెబుతారు. పలువురు చేతులు మారి చివరకు ఈ విలువైన వజ్రం 1849లో విక్టోరియా రాణి చెంతకు చేరింది.

బ్రిటిషర్లు పంజాబ్ ను అక్రమించిన తర్వాత నాటి పంజాబ్ రాజ కుటుంబం నుంచి దీన్ని తీసుకొని విక్టోరియా రాణికి ఇచ్చారు. అయితే.. ఈ అరుదైన వజ్రం మీద భారత్ తో సహా దాదాపు నాలుగు దేశాల్లో దీనిపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివరాలు నేటికీ సాగుతున్నాయి. సాధారణంగా రాచరికంలో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది.

కానీ.. కెమిల్లా విషయానికి వస్తే.. ఆమె చార్లెస్ 3కు రెండో భార్య. మొదటి భార్య ప్రేమించి పెళ్లాడిన డయానాతో 1996లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత 2005లో కెమిల్లాను పెళ్లాడారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయం సర్వేల్లోనూ వెల్లడైంది.అయితే.. కెమిల్లాకు రాణి హోదా రావాలని క్వీన్ ఎలిజిబెత్ అభిలషించటం కారణంగా ఆమెనే తదుపరి రాణిగా గుర్తించం ఖాయమని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News