గ్రౌండ్ రిపోర్ట్: 'వినుకొండ'పై జెండా పాతేదెవరో..?

Update: 2019-04-04 13:30 GMT
అసెంబ్లీ నియోజకవర్గం : వినుకొండ
టీడీపీ:  జీవీ ఆంజనేయులు
వైసీపీ: బొల్లా బ్రాహ్మనాయుడు
జనసేన: చెన్నా శ్రీనివాసరావు

గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో వినుకొండ ఒకటి. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు గెలుపొందారు. కాంగ్రెస్‌ కు కంచుకోటగా ఉన్న ఇక్కడ 2009లో ఆంజనేయులు ఘన విజయం సాధించారు. గత 2014 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిని నన్నపనేని సుధపై విజయం సాధించారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ పై గురి పెట్టారు. ఇక ఈసారైనా వైసీపీ జెండా ఎగురవేయాలని బొల్లా బ్రాహ్మనాయుడు పరితపిస్తున్నారు.

*  వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: బొల్లపల్లి, నూజెండ్ల, సావల్యపురం, ఐపూర్‌, వినుకొండ
ఓటర్లు: 2 లక్షల 40 వేలు

ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 5 సార్లు, టీడీపీ 3 సార్లు, సీపీఐ 3 సార్లు, స్వతంత్రులు 3 సార్లు  గెలిచారు. 2014లో టీడీపీకి చెందిన జి.వి. ఆంజనేయులు వైసీపీ అభ్యర్థి ఎన్‌ సుధపై విజయం సాధించారు.

*  హాట్రిక్‌ పై గురిపెట్టిన జీవీ ఆంజనేయులు:
పారిశ్రామికవేత్త అయిన ఆంజనేయులు మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. 2004లో ఆయన సతీమణి లీలావతి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఆయనే నేరుగా టీడీపీ తరుపున బరిలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి చేకూరి నరేందర్‌ పై విజయం సాధించారు. 2014లో మరోసారి గెలుపొందారు. గత ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన ఆంజనేయులు ఆ తరువాత పట్టించుకోలేదని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే చెప్పిన దానికంటే ఎక్కువే చేశానని ఆయన చెబుతున్నారు. అయితే నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్య తీవ్రంగానే ఉంది.

* అనుకూలతలు:
-వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం
-టీడీపీ బలమైన నియోజకవర్గం
-కొన్నిచోట్ల అభివృద్ధి పనులు

* ప్రతికూలతలు:
-తాగునీటి సమస్యపై పట్టించుకోలేదనే ఆరోపణ
-సొంత పార్టీలో అసమ్మతి సెగ
-ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం

* బొల్లా బ్రాహ్హణనాయుడు ఈసారి వైసీపీ జెండా ఎగురవేస్తారా..?
టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన నన్నపనేని రాజకుమారి కూతురు నన్నపనేని సుధ గత ఎన్నికల్లో వైసీపీలో చేరారు. దీంతో ఆమెకు టికెట్‌ ఇచ్చి బరిలో నిలిపారు. కానీ ఓటమి చెందడంతో అప్పటి నుంచి సుధ దూరంగా ఉంటున్నారు. దీంతో 2014లో పెదకూరపాడు నుంచి పోటీ చేసిన బ్రహ్మానాయుడిని ఈసారి ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టింది వైసీపీ. ఈయన గత ఎన్నికల్లోనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే నన్నపనేని సుధ రావడంతో ఆయన పెదకూరపాడుకు వెళ్లారు. ఈసారి ఇక్కడ అవకాశం రావడంతో తన ప్రచారపర్వాన్ని ఉధృతం చేశారు. చాలా కాలం నుంచి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు.

* అనుకూలతలు:
-నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పరిచయాలు పెంచుకోవడం
-ఆర్థికంగా బలమైన నేత కావడం
-జగన్‌ ఇమేజ్‌ తో పాటు నియోజకవర్గంలో పార్టీకి బలం పెరగడం

*ప్రతికూలతలు:
-ఇక్కడ మొదటిసారిగా బరిలో ఉండడం
-టీడీపీకి కంచుకోట కావడం
-ప్రత్యర్థి రెండు సార్లు గెలవడం

-టఫ్ ఫైట్ లో గెలుపెవరిదీ.?
జీవీ ఆంజనేయులు, బ్రాహ్మనాయుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే ఆర్థికంగా బలమున్న వారే. దీంతో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తిగా సాగుతోంది. హ్యాట్రిక్‌ కొట్టి నిరూపిస్తామనని ఆంజనేయులు ప్రచారం చేస్తుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయులును ఓడించి తీరుతామని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇక జనసేన తరుపున చెన్నా శ్రీనివాసరావును ఆ పార్టీ బరిలో ఉంచింది. ఈయన కూడా ఆర్థికంగా బలమైన నేత కావడంతో నియోజకవర్గంలో సార్వత్రిక పోరు ఆసక్తిగా మారింది.
    
    
    

Tags:    

Similar News