నిధుల‌పై అబ‌ద్ధ‌మాడుతోంది బాబా? బీజేపీయా?

Update: 2018-05-31 07:48 GMT
బీజేపీ - ఎన్డీఏతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ర‌సకందాయంలో ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్లు బీజేపీతో అంట‌కాగిన టీడీపీ ...హ‌ఠాత్తుగా ఆ పార్టీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కేంద్రం ఏపీకి నిధులు విడుద‌ల చేయ‌లేద‌ని...హోదా ఇవ్వ‌క పోగా నిధుల విష‌యంలోనూ నిర్లక్ష్యం వ‌హిస్తోంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు లెక్క‌లు చెప్ప‌లేద‌ని బీజేపీ ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తోంది. ఈ ర‌కంగా ఈ రెండు పార్టీలు ఒక‌రిపై ఒక‌రు బుర‌దజ‌ల్లుకుంటుండ‌డంతో ప్ర‌జ‌లు అయోమ‌యంలో పడ్డారు. ఇరు పార్టీల వాద‌న‌ల్లో ఏది నిజ‌మో తేల్చుకోలేక తిక‌మ‌క ప‌డుతున్నారు. ఏపీ అభివృద్ధే ల‌క్ష్య‌మంటూ 2014లో జంట‌గా బ‌రిలోకి దిగిన ఇరు పార్టీలు....2019 ఎన్నిక‌ల‌కు ముందు ఒంట‌రిపోరుకు సిద్ధ‌మ‌యి  ప్ర‌జ‌లను క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య వ‌చ్చిన తార‌తమ్యాల వ‌ల్ల‌....ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటూ ప‌బ్బం గడుపుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇరు పార్టీల‌లో ఎవ‌రు చెప్పేది నిజ‌మ‌ని ప్ర‌జ‌లు తేల్చుకోలేకున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను విభ‌జించిన సమ‌యంలో ఏపీకి 5 ఏళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ పార్ల‌మెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ నేత వెంక‌య్య‌నాయుడు...ఏపీకి ప‌దేళ్ల‌పాటు ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి 15 ఏళ్ల‌పాటు ప్ర‌త్యేక హోదా కావాల‌ని బాబు అన్నారు. చివ‌ర‌కు ...మోదీ ప్ర‌ధాని అయ్యాక ఏపీకి హోదా కుద‌ర‌దు....ప్యాకేజీ ఇస్తామని చంద్ర‌బాబుకు చెప్పారు. దానికి చంద్ర‌బాబు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేసి ప్యాకేజీ తీసుకునేందుకు అంగీక‌రించారు. అయితే, ఏపీకి హోదా డిమాండ్ ను టీడీపీ - బీజేపీలు మ‌ర‌చిపోయినా....ప్ర‌తిప‌క్ష వైసీపీతో పాటు ప్ర‌జ‌లు మ‌ర‌చిపోలేదు. దీంతో, హోదాపై బాబు యూట‌ర్న్ తీసుకోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవ‌డంతో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏపీకి విడుద‌లైన నిధుల విష‌యంలో ఎవ‌రికి వారు తాము చెప్పేదే నిజ‌మ‌ని అంటున్నారు. ఏపీకీ విడుద‌ల చేసిన 350 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం వెన‌క్కు తీసుకుంద‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని కేంద్ర మంత్రి జితేంద‌ర్ సింగ్ అన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలుంటే టీడీపీ నిరూపించాల‌ని అంటున్నారు. మ‌రోవైపు, టీడీపీ మాత్రం....ఆ నిధులు వెన‌క్కు తీసుకున్నార‌ని....రావాల్సిన నిధులు కూడా స‌క్ర‌మంగా విడుద‌ల చేయ‌లేద‌ని ఆరోపిస్తోంది. ఇంత‌కీ, చంద్ర‌బాబు అబ‌ద్ధ‌మాడుతున్నారా? బీజేపీ అబ‌ద్ధ‌మాడుతోందా? అన్న సందిగ్ధంలో ఏపీ ప్ర‌జ‌లున్నారు. ఏది ఏమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News