షా అంతటోడు సైతం కేసీఆర్ ను గట్టిగా అనలేకపోయారు

Update: 2019-04-10 07:14 GMT
తెలంగాణలో ప్రచారం చేయటానికి బీజేపీ చీఫ్ అమిత్ షా మరోసారి వచ్చారు. వెళ్లారు. ఎప్పటిలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కొన్ని విమర్శలు చేశారే కానీ.. అవేమీ షా లాంటి నేత మాట్లాడే మాటలు కావు. తాను ప్రత్యర్థిగా ఫీలయ్యే చోట షా ఎలా మాట్లాడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అందుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లు కేసీఆర్ మీద విమర్శలు చేశారు.

చూసేందుకు.. వినేందుకు కేసీఆర్ మీద ఘాటు విమర్శలు చేసినట్లు కనిపించినా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతుందని.. ఆ పాలన నుంచి విముక్తి కల్పించటం బీజేపీతోనే సాధ్యమన్న షా.. ఎప్పటిలానే కేసీఆర్ కుటుంబం మీద పాత ఆరోపణలు.. విమర్శలు చేశారు.

ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో ఒక్క కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని.. 16 మంది ఎంపీలను గెలిపించాలని కోరుతున్న కేసీఆర్.. ఆ సంఖ్యతో ప్రధాని అవుతారా? అని ప్రశ్నించారు. కేసీఆర్.. ఓవైసీకి భయపడుతున్నారని.. అందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేకపోతున్నట్లు వ్యాఖ్యానించారు. పలు జాతీయ అంశాలు.. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి.. దానికి మోడీ సర్కారు స్పందించిన తీరును ఆయన ప్రస్తావించారు. పాక్ భూభాగంలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ను తన ప్రచారంలో ప్రస్తావించారు. ఓవైసీతో జత కట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. టెర్రరిస్టులకు గట్టి సమాధానం ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారు.

షా వ్యాఖ్యలు చూస్తే.. కేసీఆర్ ను కడిగిపారేయాలన్న తలంపు పెద్దగా కనిపించదని చెప్పాలి. ఎన్నికల వేళ ప్రచారానికి వచ్చినప్పుడు పరిమితమైన మోతాదులో ప్రశ్నించాలని కాబట్టి ప్రశ్నించినట్లుగా.. విమర్శించినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. అంతేకానీ.. తమ ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరులో షా మాటలు లేకపోవటం చూస్తే.. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మద్దతు తీసుకునేందుకు వీలుగా ఆయన విమర్శలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. 
Tags:    

Similar News