మాటలు అనిపించుకోవటం ఎందుకు? చిన్న ఇల్లు కొనొచ్చుగా బాబు?

Update: 2019-10-31 04:07 GMT
వేలాది ఎకరాలు రైతుల నుంచి సేకరించి.. అత్యద్భుత రీతిలో రాజధాని నగరాన్ని నిర్మిస్తానంటూ చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఐదేళ్ల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క శాశ్విత భవనాన్ని నిర్మించే విషయంలో సక్సెస్ కాని బాబు.. వందల కోట్లు తగలబెట్టేయటం తెలిసిందే. రాజధాని నిర్మాణం అంటే సినిమా సెట్టింగ్ అనుకున్నారేమో కానీ.. దిగ్గజ దర్శకుడు రాజమౌళిని తీసుకొని కాసింత హడావుడి చేయటం.. చివరకు అదేమీ వర్క్ వుట్ కాకపోవటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు కానీ.. కోట్లాది మందిని రాజధాని పేరుతో కనెక్ట్ చేసే ప్రయత్నం చేసిన చంద్రబాబు.. తాను మాత్రం కనెక్ట్ కాని విషయం ఇప్పటికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. రాజధాని గురించి మా గొప్పలు చెప్పే చంద్రబాబు.. అమరాతిలో కానీ.. చుట్టుపక్కల గ్రామాల్లో కానీ సొంతింటిని ఎందుకు కొనుగోలు చేయలేదన్న ప్రశ్న అర్థం కాని పరిస్థితి.

ఇప్పుడు అదే ఆయన పాలిట శాపంగా మారింది.  రాష్ట్రంలో పర్మినెంట్ అడ్రస్ లేని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రమే అంటూ మంత్రి బొత్స సత్యానారాయణ విరుచుకుపడ్డారంటే దానికో అర్థముందని చెప్పాలి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేని బాబు.. తన వాళ్లకు.. తన సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున మేళ్లు చేశారంటూ మండిపడ్డారు.

బాలయ్య వియ్యంకుడు వియ్యంకకుడు వెంకటరావు.. ఆయన కుమారుడు శ్రీభరత్ లకు గత ప్రభుత్వం ఎకరా రూ.50 లక్షలకు ఇచ్చారని.. ఆ తర్వాత ఆ భూముల్ని సీఆర్డీయేలో కలిపారని.. దీనికి మించిన ఉదాహరణ ఏముంటుందని గుట్టు విప్పారు. ఏపీలో సొంతిల్లు లేని చంద్రబాబు.. హైదరాబాద్ లో మాత్రం రూ.250 కోట్లతో ఇంద్రభవనం లాంటి నివాసాన్ని నిర్మించుకున్నారని.. రాజధాని పేరుతో అందరిని తీసుకొచ్చి అడవిలో పడేశారన్నారు. వినేందుకు ఈ మాటలు కాస్త కటువుగా ఉన్నట్లు అనిపించినా.. తరచి చూస్తే బొత్స మాటల్లో వాస్తవం ఉందని చెప్పక తప్పదు.

నిత్యం ఎన్నో మాటలు చెప్పే చంద్రబాబు.. రాజధాని పరిసర ప్రాంతాల్లో సొంతిల్లు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదన్న విషయం మీద వివరణ ఎందుకు ఇవ్వరన్న ప్రశ్నకు సమాధానం లభించదు. తప్పు చేసినప్పుడు మాట తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి.. రాజధాని పేరుతో హడావుడి చేసిన ముఖ్యనేత.. తన సొంతిల్లు ఒకటి ఎందుకు ఏర్పాటు చేసుకోలేదన్నది మాత్రం క్లారిటీ ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉండటాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News