కేసీఆర్ పిలవలేదు.. బీహార్ సీఎం నితీష్, జేడీఎస్ కుమారస్వామి అందుకే రాలేదా?

Update: 2023-01-20 05:32 GMT
ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు కొందరు జాతీయ నాయకులు కూడా వచ్చారు. కానీ ఈ సభలో బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పిన బీహార్ సీఎం నితీష్ కుమార్..  కర్ణాటక మాజీ సీఎం,  జేడీఎస్ నేత కుమార స్వామి కనిపించలేదు. మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని చెప్పడానికే ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కానీ వీరిద్దరు  హాజరు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వారు హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల కోసం యాత్రలు చేపడుతున్నందున రాలేదన్నారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మాత్రం అసలు ఆహ్వానమే అందలేదట. ఈ గందరగోళ పరిస్థితి బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయింది.

జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చేందుకు  బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభను నిర్వహించి ప్రత్యేకంగా నిలిచారు. ఈ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ హాజరయ్యారు. వీరిలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన పినరయి మొదటి నుంచి కాంగ్రెస్ కూటమిలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అలాగే కొనసాగుతామని చెప్పారు. అయితే మోదీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ అయినందునే ఆయన హాజరైనట్లు చెప్పారు.

ఈ సభలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార స్వామి కనిపించలేదు. కేంద్రపై పోరు మొదలు పెట్టిన తరుణంలో కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఈ తరుణంలో బెంగుళూరు వెళ్లిన కేసీఆర్ మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకుడు దేవేగౌడను కలిశారు. జాతీయ రాజకీయాల గురించి వారితో మాట్లాడారు. అయితే బీఆర్ఎస్ మారిన తరువాత ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభానికి కుమారస్వామి హాజరయ్యారు.  కానీ ఖమ్మంలో నిర్వహించిన సభలో కనిపించలేదు. ఈ విషయంపై ఆయనను పలువురు అడగగా వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికార లక్ష్యం కోసం 'పంచరత్న' యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్రలో బిజీ అయినందున హాజరు కాలేదని వివరణ ఇచ్చారు.

ఇక బీహార్ సీఎం తనకు ఖమ్మం సభ గురించి తెలియదన్నారు. ఒకవేళ ఆహ్వానం అందినా హాజరు కాకపోయేవాడినని చెప్పారు. తాను కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 'సమాధాన్ యాత్ర' చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఎలాంటి సభ నిర్వహించిన తాము మద్దతు ఇస్తామని, ఖమ్మం సభకు హాజరు కాకపోతే మద్దతు ఉప సంహరించుకున్నట్లు కాదని నితీశ్ తెలిపారు. అయితే ఆ రాష్ట్రానికి చెందిన ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సైతం ఖమ్మం సభలో కనిపించలేదు.

అయితే వీరిద్దరు హాజరు కాకపోవడం మరో చర్చకు దారి తీస్తోంది. కేసీఆర్ నిర్వహించే బీజేపీ, కాంగ్రెసేతర కూటమికి మద్దతు ఇవ్వాలా..? లేదా..? అనేది ఇంకా నిర్ణయించుకోనట్లు సమాచారం. కర్ణాటకలోని జేడీఎస్ కాంగ్రెస్ కూటమిలో భాగం కాకపోయినా ఆ పార్టీ మద్దతుతోనే గతంలో సీఎం అయ్యారు.

అందువల్ల కాంగ్రేసేతర సభకు హాజరైతే వచ్చే రోజుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆలోచించినట్లు సమాచారం. అలాగే నితిష్ కుమార్ సైతం వచ్చే ఎన్నికల పరిస్థితులను ముందుగానే ఆలోచించి ఈ సభకు రాలేదని తెలుస్తోంది. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల వరకు ఏ పార్టీలు కేసీఆర్ తో కలిసి వస్తాయోనన్నది చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News