ఇవాంక ట్రిప్పుకు బాబు దూర‌మెందుకు?

Update: 2017-11-26 04:03 GMT
ప‌బ్లిసిటీ వ‌చ్చే విష‌యాల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌రు. త‌న మార్క్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. అలాంటి చంద్ర‌బాబు హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగే గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ స‌ద‌స్సు షార్ట్ క‌ట్ లో చెప్పాలంటే జీఈఎస్ కు ఎందుకు దూరంగా ఉన్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌పంచానికి పెద్ద‌న్న అయిన అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె ఇవాంక హాజ‌ర‌వుతున్న ఈ స‌ద‌స్సుకు ఏపీ దూరంగా ఉన్న‌ది ఎందుక‌న్న‌ది ప‌లువురి మ‌దిని తొలిచేస్తున్నాయి.

దీనికి స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న ఈ స‌ద‌స్సును నీతి అయోగ్‌.. అమెరికా ప్ర‌భుత్వాలు క‌లిసి నిర్వ‌హిస్తున్నాయి. ఈ స‌మ్మిట్ లో పాల్గొనాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించింది. స‌హజంగా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు రావాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాల్ని స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న ప‌క్షాలు ఇన్విటేష‌న్ పంపుతాయి. కానీ.. ఈ స‌ద‌స్సు విష‌యంలో మాత్రం ఇందుకు భిన్నం.

త‌మ‌ను ఆహ్వానించ‌కునప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం ఎంత ప్ర‌య‌త్నం చేయాలో అంత చేసింది. ఈ స‌మ్మిట్ లో పాల్గొనాల‌న్న ఆస‌క్తితో తాము ఉన్నామంటూ ఏపీ ఎక‌నామిక్ బోర్డ్  కేంద్రానికి లేఖ రాసింది. స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స్థానిక ప్ర‌భుత్వాల పాత్ర ఏమీ లేద‌ని.. అంత‌ర్జాతీయ స‌ద‌స్సును నిర్వ‌హించే క్ర‌మంలో వేదిక‌గా హైద‌రాబాద్ ను ఎంచుకున్నామే త‌ప్పించి మ‌రింకేమీ లేద‌ని పేర్కొంది.

స్థానిక ప్ర‌భుత్వాల‌తో పాటు.. కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌ల్ని కూడా ఆహ్వానించ‌టం లేద‌ని వెల్ల‌డించింది. స‌ద‌స్సుకు మిమ్మ‌ల్ని పిల‌వలేమ‌న్న మాట‌ను సూటిగా చెప్ప‌కుండానే.. ఎవ‌రిని పిల‌వ‌టం లేదు.. మిమ్మ‌ల్ని కూడా అంతే అంటూ త‌నదైన రీతిలో కేంద్రం స‌మాధానం చెప్ప‌టంతో ఏపీ స‌ర్కారు మిన్న‌కుండిపోయింది. అడిగి మ‌రీ కాద‌నిపించుకున్న త‌ర్వాత బాబుకు ఎంత త‌ప‌న ఉన్నా ఏం చేయ‌గ‌ల‌రు?
Tags:    

Similar News