అసెంబ్లీ కోసం ఓకే గానీ మోడీ కోసం కాదు

Update: 2019-06-19 08:11 GMT
ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబంతో యూరప్ వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసు కదా. అయితే, ఇదే రోజు వాస్తవానికి ఆయనకు ఢిల్లీకి రమ్మని ఆహ్వానం ఉంది. ఐదారు రోజుల కిందట అందిన ఆ ఆహ్వానాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారు. దేశంలో జమిలి ఎన్నికలు పెట్టడంతో పాటు పలు ఇతర ముఖ్య అంశాలపై దేశంలోని అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు, ఆయా పార్టీ అధ్యక్షులతో కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటుచేసింది. దేశానికి కొత్తగా మార్గదర్శనం చేయడానికి ఐడియాలు కావాలి కలిసి చర్చిద్దాం అంటూ అందరినీ పిలిచింది. అందులో భాగంగా చంద్రబాబుకు కూడా తెలుగుదేశం అధ్యక్షుడి హోదాలో ఆహ్వానం అందింది.

ఎన్నికల ఫలితాల అనంతరం రెండు మూడు రోజుల్లోనే విదేశీ పర్యటనకు ప్లాన్ చేసిన చంద్రబాబు కొత్త ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ షెడ్యూల్ ను ప్రకటించడంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. మిగతా సమయాల్లో ఓకే గాని తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం పార్టీ అధ్యక్షుడిగా తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు తన పర్యటన 18-24 తేదీల మధ్య పెట్టుకున్నారు. ఆ టూర్ నిర్ణయం అయిన కొన్ని రోజులుకు ప్రధాని నరేంద్ర మోడీ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా తెలుగు ముఖ్యమంత్రులతో పాటు చంద్రబాబుకు కూడా ఆహ్వానం పంపారు. ఇక రెండో సారి పర్యటన వాయిదా వేసి కుటుంబాన్ని డిజప్పాయింట్ చేయడం ఎందుకని ఆ సమావేశానికి చంద్రబాబు డుమ్మాకొడుతున్నారు. అయితే, ఆహ్వానంలో పేర్కొన్న అజెండాపై తన అభిప్రాయాలను ఒక లేఖ రూపంలో తన ఎంపీల ద్వారా చంద్రబాబు పంపారు. మొత్తానికి పరాజితుడిగా విజేత మోడీ ముందు మొహం చూపించుకోవాల్సిన బాధ నుంచి చంద్రబాబు తనను తాను విముక్తిడిని చేసుకోవడానికి ఒక అనుకోని అవకాశం దక్కినట్టే చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా... ఈ సమావేశానికి తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు.


Tags:    

Similar News