దక్షిణాది అంతటా వరదలొచ్చినా చెన్నైలో తాగునీరు లేదెందుకు?

Update: 2019-08-10 15:17 GMT
మధ్యభారతం, దక్షిణాదిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వాగులువంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేస్తున్నారు.. ఊళ్లు, పట్టణాలు, నగరాలు మునుగుతున్నాయి.. ఎటుచూసిన జలమయమే. కానీ... ఇలాంటి పరిస్థితుల్లోనూ తమిళనాడు రాజధాని చెన్నై నగరం మాత్రం నీటి కష్టాల నుంచి గట్కెక్కేలేదు. ఇంకా చెన్నై గొంతు తడారే ఉంది. ఈ కుంభవృష్టులేవీ తమిళనాడును కొంచెం కూడా టచ్ చేయలేదు.. చెన్నై గొంతులో చెమ్చాడు నీరు కూడా పోయలేదు. దీంతో తమకు తాగు నీరు కావాలంటూ తమిళనాడు నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఏపీలో గోదావరి- కృష్ణా నదులు పొంగిపొర్లుతున్న సమయంలో చెన్నైకి నీరిచ్చేందుకు జగన్ అంగీకరించారు.

రోజుకు 10 వేలకు పైగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న చెన్నై ప్రజల దాహార్తి తీరడం లేదు. పబ్లిక్ కుళాయిల నుంచి నీరొచ్చి చాలాకాలం దాటిపోయింది. ట్యాంకర్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. చెన్నైకి నీటిని అందించే పూండి,- పుళల్‌- చోళవరం- చెంబరంబాక్కం- రెడ్‌ హిల్స్‌- వీరాణం రిజర్వాయర్లలో చుక్క నీరు కూడా లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇప్పటికైనా వరుణుడు కరుణించి తమ నీటి కష్టాలు తీర్చాలని చెన్నై ప్రజలు కోరుకుంటున్నారు.

అయితే.. తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అతివృష్టి, వరదలతో కష్టాలు పడుతున్నాయి. తమిళనాడుతో సరిహద్దు గల మూడు రాష్ట్రాలు కేరళ- కర్ణాటక- ఆంధ్రప్రదేశ్‌ ల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఆపైన మహారాష్ట్ర అయితే గత రెండు నెలలుగా అతివృష్టితో ఇబ్బందులు పడుతోంది. ముంబయి నగరం తరచూ జలమయమవుతోంది. ఇటు తెలంగాణ- ఒడిశా- ఛత్తీస్ గఢ్- మధ్య ప్రదేశ్ దక్షిణ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం అయితే వరదల్లో చిక్కుకుంది. చివరికి ఏడాదిలో రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా వర్షాలు పడని దిల్లీని కూడా ఈ ఏడాదివర్షాలు ముంచెత్తాయి. గత నెల రోజులుగా దిల్లీలో దాదాపు ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట వర్షం కురుస్తూనే ఉంది.

ఏపీ, తెలంగాణల్లో నిండుగా జలాశయాలు, ప్రాజెక్టులు
గోదావరి, దాని ఉప నదుల పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో ఏపీ, తెలంగాణల్లో ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. మరోవైపు కృష్ణాన‌దీ పోటెత్తుతోంది. వరద నీరు దిగువకు ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టుల‌ు జ‌ల‌క‌ళ సంత‌రించుకుంటున్నాయి. మ‌హారాష్ట్ర‌- క‌ర్ణాట‌క‌ల్లో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఆల్మ‌ట్టి డ్యామ్ నిండింది. అక్క‌డి నుంచి దిగువ‌కు మిగులు జ‌లాలు విడుద‌ల చేయ‌డంతో నారాయ‌ణ‌పూర్- జూరాల‌- ప్రాజెక్టులూ నిండుతున్నాయి. జూరాల నుంచి శ్రీశైలానికీ నీరొస్తోంది. అక్కడ గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్‌ లోకి నీరు చేరుతోంది. గోదావరి పొంగిపొర్లడంతో తొలుత సుమారు 400 గ్రామాలు నీటమునిగాయి.. ప్రస్తుతం ఇంకా 60 గ్రామాలు నీటి మధ్యే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో నీటికి కొరత లేకపోవడమే కాదు అవసరానికి మించి వరదలు పోటెత్తుతున్నప్పటికీ చెన్నైలో మాత్రం ఇంకా తాగునీటి సమస్య ఉండడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు.

వర్షాలు కురిసినప్పుడు ఆ నీరు భూమిలోకి వెళ్లే అవకాశం తగ్గిపోవడం కూడా నగరాలకు పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతి ఏటా పడే వర్షంలో 16 శాతం భూగర్భంలోకి వెళ్లాలి. కానీ, చెన్నై వంటి పెద్ద నగరాల్లో 5 శాతం కూడా భూగర్భంలోకి వెళ్లట్లేదు. దీనికి ఏకైక కారణం కాంక్రీటు నిర్మాణాలే. మిగతా నగరాలూ చెన్నై కంటే ఈ విషయంలో తీసిపోలేదు. ఆ నగరాలకూ ముందముందు ముప్పు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మురుగునీటి శుద్ధిపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.  
    

Tags:    

Similar News