యుద్ధం గెలిచినా..అరుణాచల్ ను చైనా ఎందుకు వదులుకుంది?

Update: 2020-09-12 02:30 GMT
భారత్ - చైనాల మధ్య 1962లో జరిగిన యుద్దంలో చైనానే విజయం సాధించింది. సాధారణంగా యుద్ధం గెలిచిన దేశం గానీ, రాజ్యం గానీ... ఏం చేస్తాయి? శత్రు దేశంలో వీలయినంత మేర ప్రాంతాన్ని ఆక్రమించేస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా అరుణాచల్ ప్రదేశ్ ను తమలో కలుపుకునే విషయంలో మాత్రం చైనా వెనుకంజ వేసింది. నిజమా? అంటే... ఓ వైపు చరిత్ర ఇదే విషయాన్ని చెబుతుండగా, మరోవైపు ఏళ్ల తరబడి అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా భాగం తమదేనని ఇప్పటికీ చైనా వాదిస్తుండటంతో ఈ వాదన నిజమేనని చెప్పక తప్పదు. మరి అరుణాచల్ ప్రదేశ్ లోని సగానికి పైగా భూభాగం తమదేనని బీరాలు పలుకుతున్న చైనా... 1962నాటి యుద్ధంలో గెలిచినా కూడా ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ స్వాధీనానికి ఎందుకు సిద్ధపడలేదు? దీని వెనుక చాలా వ్యూహాత్మక అంశాలున్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈశాన్య భారత్ లోకి చైనా బలగాలు క్రమంగా చొచ్చుకువస్తున్న నేపథ్యంలో మరోమారు ఇరు దేశాల మధ్య ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదేమోనన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో 1962 యుద్ధం - ఆ యుద్ధం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ను చైనా వదిలేయడం తదితర అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. నాటి నుంచి నేటి దాకా అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రజలు ఏనాడూ చైనాకు అనుకూలంగా వ్యవహరించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో అరుణాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకున్నా.. అక్కడి ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించలేమన్నది చైనా భావన. ఈ కారణంగానే నాడు అరుణాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకునే అవకాశం చిక్కినా చైనా ఆ దిశగా అడుగులు వేయలేదు.

చైనా వెనుకంజకు మరో రెండు కారణాలు కూడా లేకపోలేదు. 1962లో తన చేతిలో భారత్ ఓడిపోయినా.. భారత సైన్యం ప్రతిభాపాటవాలు, శక్తిసామర్థ్యాలను చైనా తక్కువగా అంచనా వేయలేదు. నాడు గానీ, నేడు గానీ భారత సైన్యం అంటే చైనా భయమే. భారత్ కంటే కూడా సైనిక పరంగా బలంగా ఉన్నప్పటికీ... భారత్ సైన్యాన్ని చూస్తే చైనాలో వణుకుపుడుతోంది. ఈ కారణంగానూ అరుణాచల్ ను చైనా తనకు తానుగా వదిలేసిందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక అరుణాచల్ ప్రదేశ్ తో చైనాకు ఉన్న సరిహద్దును మెక్ మోహన్ రేఖగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేఖపై ఇప్పటిదాకా పెద్దగా స్పష్టతే లేదు. అంటే... చైనా అరుణాచల్ ప్రదేశ్ లోకి చొచ్చుకువచ్చినా.. మెక్ మోహన్ రేఖను ప్రస్తావిస్తూ భారత్ అంతర్జాతీయంగా పోరాటం మొదలెడితే ఇబ్బందేనన్నది చైనా భయం. ఈ  అంశం కూడా అరుణాచల్ ను చైనా వదిలేయడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.  


Tags:    

Similar News