చిరంజీవి వద్దన్నాడ.. వదులుకున్నాడా?

Update: 2020-02-20 14:30 GMT
అనుకోకుండా వస్తున్న అవకాశం.. ప్రస్తుతం ఎలాంటి పదవి లేకుండా ఉన్న సమయంలో మళ్లీ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు వస్తున్న పదవి.. గతంలో అలంకరించిన ఆ పదవినే మళ్లీ వస్తానంటూనే.. వద్దని వెనక్కి జరిగారు. ఎందుకు.. ఏం ఆలోచించారు.. ఎందుకు కాదనుకుంటున్నారు.. ఎవరైనా వద్దన్నారా? లేకుంటే స్వయంగా వదులుకుంటున్నారా? అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. అదే చిరంజీవికి రాజ్యసభ అవకాశం. రాజ్యసభకు అవకాశమిస్తామంటే వద్దన్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఎందుకు? ఏమిటి? అనేవి ప్రశ్నలు మొదలయ్యాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్సీపీకే ఆ నాలుగు స్థానాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో అందులో ఒక స్థానాన్ని మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాలు, సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని చిరంజీవి కి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంట. అయితే దీనిపై కొన్నాళ్లు ఆలోచించిన అనంతరం చిరంజీవి చివరకు కాదన్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. అడగకుండానే వస్తున్న పదవి.. మళ్లీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం చిరంజీవి వదులుకున్నారని సమాచారం.

అయితే ఆయన రాజ్యసభ సీటును కాదనడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు సినిమాపరంగా, కుటుంబపరంగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం రాజకీయాలను పూర్తిగా వదిలేసి సినీ పరిశ్రమలోకి చిరంజీవి మళ్లీ వచ్చారు. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. రాజకీయాల వలన ఇన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్లీ రాజ్యసభ తో పిలుపు వస్తోంది. అయితే తనకు సినిమాలు చాలా ఇష్టమని చాలాసార్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. అందుకే వైఎస్సార్సీపీ ఇస్తున్న అవకాశాన్ని కాదంటున్నారంట. ఆ ఆఫర్ ను తీసుకుంటే తన అభిమానులకు మళ్లీ సమాధానం చెప్పుకో లేని పరిస్థితి ఏర్పడుతుందని భావించారంట. ఇప్పటికే ఓ దశాబ్దం తన అభిమానులకు దూరమయ్యానని బాధ పడ్డారు. ఇప్పుడు దూరం కాలేనని స్థిర నిర్ణయం తీసుకుని కాదన్నారని తెలుస్తోంది.

దీనికి తోడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో తన సోదరుడు పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తే తమ్ముడికి ఇబ్బందులు ఎదురవుతాయని భావించారంట. తమ కుటుంబ అభిమానుల మధ్య చిచ్చు రేగే ప్రమాదం ఉందని ఊహించి.. తన సోదరుడి కోసం చిరంజీవి రాజ్యసభ ఆఫర్ కాదంటున్నారంట. సినిమాల్లో కూడా తన కుటుంబ హీరోలు నిలదొక్కుకోవడానికి ప్రస్తుతం చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబం కోసం, తన అభిమానుల కోసం.. చిరంజీవి వైఎస్సార్సీపీ పిలిచి ఇస్తున్న రాజ్యసభ సీటును సున్నితంగా తిరస్కరించారంట.
Tags:    

Similar News