మోడీ ప్రత్యర్థి.. కాంగ్రెస్ ను ఏసుకున్నాడు

Update: 2016-12-22 11:05 GMT
మోడీ ప్రస్తావన వస్తే చాలు ఆగ్రహంతో గొంతు విప్పే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అందుకు భిన్నంగా వ్యవహరించారు. సెల్ఫ్ గోల్ కొట్టుకోవటంలో తనకు తానే సాటి అన్నట్లుగా వ్యవహరించే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాటలపై ఆయన గరంగరంగా ఉన్నారు. ప్రధాని మోడీకి సంబంధించి తన దగ్గరున్న సమాచారంపై పెదవి విప్పితే.. భూకంపమేనంటూ హైప్ క్రియేట్ చేసిన కాంగ్రెస్ యువరాజు.. కొండను తవ్వి ఎలుకను పట్టిన తీరుకు నవ్వులపాలైందా పార్టీ.

మోడీకి రెండు కంపెనీలురూ.40 కోట్ల ముడుపులు ఇచ్చినట్లుగా చెప్పిన రాహుల్.. అదంతా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో అంటూ చావు కబురు చల్లగా చెప్పటంపై కేజ్రీవాల్ మండిపడుతున్నారు. అప్పుడెప్పుడో జరిగిపోయిన అవినీతి గురించి ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్న కేజ్రీవాల్.. అప్పుడేం చేశారంటూ ప్రశ్నించారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ అవినీతికి పాల్పడి ఉంటే.. 2013లో కాంగ్రెస్ పార్టీ ఆయన అవినీతి గురించి ఎందుకు పట్టించుకోలేదు? చర్యల కోసం ఎందుకు డిమాండ్ చేయలేదు? అని ప్రశ్నించారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే తన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించిన కేజ్రీవాల్.. ‘‘అప్పట్లో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోడీ అవినీతి గురించి రాహుల్ వెల్లడించిన వెంటనే.. క్రాస్ చెసుకోని కేజ్రీవాల్.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ మీద నమ్మకంతో తొందరపడి వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్.. ఇప్పుడు నాలుక్కర్చుకొని.. తనను అడ్డంగా బుక్ చేసిన కాంగ్రెస్ పై గరంగరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టేయటం ద్వారా తాను చేసిన తప్పు నుంచి బయటపడాలన్నట్లుగా ఢిల్లీ సీఎం వైఖరి ఉన్నట్లుగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News