సజ్జలకు రామోజీ చిట్ ఫండ్ కంపెనీ ఎందుకు గుర్తుకొచ్చింది?

Update: 2022-07-01 03:39 GMT
విశ్వంలో అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది కాలమే. దాని దెబ్బకు ఎలాంటివాడు మరెలా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదంతా కాల మహిమ. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రికి కళ్లు.. చెవులుగా చెప్పే సజ్జల  రామకృష్ణారెడ్డి సంగతే తీసుకుంటే.

ఈనాడు సంస్థలో పాత్రికేయుడిగా పని చేశారు. మంచి వ్యక్తిగా.. సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. అలాంటి సౌమ్యమూర్తి ఇప్పుడు సీఎం జగన్ లాంటి అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా నడిపిస్తున్నారన్న పేరుంది. అలాంటి ఆయన.. తన గత యజమాని అయిన రామోజీని ఉద్దేశించి మాట్లాడేందుకు అస్సలు వెనుకాడరు.

అవసరం ఉన్నా లేకున్నా రామోజీ మీద అక్కసును వెళ్లగక్కటంలో ఆయనకు సాటి మరెవరూ రారనే చెప్పాలి. పలు సందర్భాల్లో రామోజీ ప్రస్తావన లేదంటే ఈనాడు ప్రస్తావన తీసుకురాకుండా ఉండరనే చెప్పాలి. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా రాసిన వెంటనే.. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా ఆనేస్తారన్న ఆరోపణను ఆయన ఎదుర్కొంటున్నారు. తాజాగా చూస్తే.. మూడేళ్లుగా సంక్షేమ పాలనను జగన్ ప్రభుత్వం అందిస్తున్నట్లుగా సజ్జల పేర్కొన్నారు.

అవినీతికి అస్కారం లేకుండా.. పారదర్శక పాలన అంటే ఇదేనంటూ ఆయన తనదైన శైలిలో మాటలు చెబుతూ చెలరేగిపోయారు. తమ పాలన విషయంలో అవసరం లేకున్నా ఎల్లో మీడియా.. టీడీపీ ఏదోలా బురద జల్లుతుందని.. అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్లుగా మండిపడ్డారు. ఎన్నికల హామీ ప్రణాళికల్లో 90 శాతానికి పైగా హామీల్ని తాము పూర్తి చేశామని చెప్పిన ఆయన.. రోజుకో అబద్ధంతో తమ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

మద్యంలో విషం కలుపుతున్నారన్న ఆరోపణలు దారుణమని.. టీడీపీ ఎజెండాను ఎల్లో మీడియా సిద్ధం చేస్తుందని.. ల్యాప్ ట్యాప్ లపై ఇష్టానుసారంగా కథనాల్ని ప్రచురిస్తున్నారన్నారు.

ఏ ప్రభుత్వమైనా రూ.800 కోట్లు లెక్కలు లేకుండా తీసుకుంటుందా? అని ప్రశ్నించిన ఆయన.. ఇదేమైనా రామోజీ రావు చిట్ ఫండ్ కంపెనీనా? అంటూ విరుచుకుపడటం చూస్తే.. కొత్త సందేహాలు కలుగక మానదు. అంతా చక్కగా ఉందన్నప్పుడు.. తమ ప్రత్యర్థులు చేసే ప్రచారానికి అంత ఉలికిపాటు ఎందుకు సజ్జల? అన్న ప్రశ్న వేయకుండా ఉండలేం.
Tags:    

Similar News