చంద్ర‌బాబు అత్యవ‌స‌ర మీటింగ్ ఎందుకు పెట్ట‌బోతున్నాడు?

Update: 2021-04-29 10:20 GMT
టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు..  అత్య‌వ‌స‌ర స‌మావేశం పెట్ట‌బోతున్నారా?  త‌న పార్టీ ప‌రిస్థితిపై ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారా?  ఈక్ర‌మంలో వెంట‌నే `ఏదో ఒక‌టి తేల్చేయాలి` అని నిర్ణ‌యించుకున్నారా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం టీడీపీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెప్పుకొంటున్నారు. ఎందుకంటే.. పార్టీలో చంద్ర‌బాబు హ‌వా ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే పార్టీ న‌డుస్తోంద‌నే అభిప్రాయం సీనియ‌ర్ల‌లో క‌లుగుతోంది. దీంతో పార్టీలోని సీనియ‌ర్ల‌కు-జూనియ‌ర్ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో ఇక‌, టీడీపీలో ఉండ‌లేం! అనే వారు పెరుగుతున్నార‌ని, ఇలాంటి వారంతా .. బీజేపీ వైపు చూస్తున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. దీనికి కూడా కార‌ణం ఉంద‌ని అంటున్నారు. అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇప్ప‌టికే అక్క‌డ గంప‌లు.. గంప‌లుగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో టికెట్ ఎవ‌రికి ఇస్తారో తెలియ‌ని ఒక అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. ఇదే విష‌యాన్ని వైసీపీ నేత‌లు కూడా స్ప‌ష్టం చేస్తుండ‌డంతో టీడీపీలో ఉన్న సీనియ‌ర్లు.. ఇక‌, బీజేపీ వైపు చూస్తున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక‌, ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు.. రెండుమూడు రోజుల్లో పార్టీలో ఆది నుంచి త‌న‌తోపాటు న‌డిచిన సీనియ‌ర్ల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం పెట్టి.. `విష‌యం` తేల్చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. లోకేష్ వ‌ల్ల పార్టీలో ఎక్కువ గ్యాప్ ఏర్ప‌డితే.. మొత్తానికే పార్టీకి ప్ర‌మాద‌మ‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇక‌, సీనియ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ``మేం బాబు హ‌యాంలో ప‌నిచేయ‌డానికి ఓకే. కానీ, లోకేష్ చెబితే.. చేసేది లేదు`` అని కొంద‌రు క‌రాకండీగా చెబుతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు త‌మ‌కు ఆప్ష‌న్‌గా బీజేపీని ఎంచుకుంటున్నార‌ని.. ఈ క్ర‌మంలో టీడీపీ హైక‌మాండ్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఇక‌, ఇప్పుడు వైసీపీ స‌ర్కారు స్పీడు పెంచ‌డంతో .. టీడీపీ నేత‌లు అల్లాడి పోతున్నారు. వ‌రుస అరెస్టులు, జైళ్లు వంటివి నేత‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. పార్టీ కోసం ఎంత శ్ర‌మించినా ఇలాంటి క‌ష్ట కాలంలో కూడా త‌మ‌కు ఆప‌న్న హ‌స్తం అంద‌డం లేద‌ని వారు వాపోతున్నారు. ఈ క్ర‌మంలోనే వారు స‌హ‌నం కోల్పోతున్నారు. అదే బీజేపీలోకి వెళ్తే.. కేసులు, అరెస్టులు ఉండ‌వు క‌దా! అనే భావ‌న వారిలో వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు తాజాగా ఈ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. ఇలాంటి వారికి హిత‌బోధ చేసి.. పార్టీలోనే ఉండేలా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి 2-3 రోజుల్లో ఈ స‌మావేశం జ‌ర‌గ‌డం అయితే ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌, ఇది డైరెక్ట్‌గా జ‌రుగుతుందా?  లేక జూమ్‌లో జ‌రుగుతుందా?  లేక అత్యంత ర‌హ‌స్యంగా జ‌రుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి స‌మావేశం అయితే ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News