డేటా దాచి పెట్టటానికి హైదరాబాద్ సేఫ్ ఎందుకు?

Update: 2020-11-07 07:00 GMT
దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ హైదరాబాద్ మహానగరంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. దగ్గరదగ్గర రూ.20వేల కోట్లకుపైనే పెట్టుబడులుపెట్టటం.. అది కూడా డేటా సర్వీసుల కోసం కావటం గమనార్హం. డేటా కేంద్రాల క్లస్టర్ ను ఏర్పాటు చేయటానికి అమెజాన్ హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవటంతో.. రానున్న రోజుల్లో ఈ విభాగానికి సంబంధించి మరిన్ని కంపెనీలు ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. హైదరాబాద్ లో ఇప్పటికే డేటా సెంటర్లు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న కేంద్రాల డేటా సామర్థ్యం దాదాపు 32 మెగావాట్ల వరకు ఉందని చెబుతారు. సమీప భవిష్యత్తులో మరింత పెరగనుంది. ఇంతకీ.. డేటా స్టోరేజీకి హైదరాబాద్ ను ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు? ఇక్కడ ఉన్న సానుకూలతలు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. చాలానే కారణాలు ఉన్నాయని చెప్పాలి.

రానున్న రోజుల్లో వచ్చే సరికొత్త టెక్నాలజీలు (5జీ.. ఎడ్జ్ కంప్యూటింగ్.. ఐఓటీ) లాంటివాటితో డేటా వినియోగం పెరిగిపోవటంతో పాటు.. అవసరాలు ఎక్కువ అవుతాయి. ఈ నేపథ్యంలో ఆ అవసరాలకు తీర్చేలా డేటా కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఏ సంస్థ అయినా తమ డేటాను ఒక చోట మాత్రమే కాకుండా.. రెండుమూడు చోట్ల దాస్తుంది. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకపోయినా.. ఏదైనా విపత్తులకుగురైతే.. బ్యాకప్ కోసం డేటాను వేర్వేరు చోట్ల ఉంచటం అందరూ చేసేదే.

ఏదైనా సమస్య వల్ల డేటాకు డ్యామేజ్ జరిగితే.. జరిగే నష్టం అపారం. అందుకే.. డేటాను వేర్వేరుప్రాంతాల్లో నిల్వ చేస్తుంటారు. ఈ బ్యాకప్ కు అనువైన ప్రదేశంగా హైదరాబాద్ ను కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. విపత్తులు తక్కువగా ఉండటమే కాదు.. దేశానికి మధ్య భాగంలో ఉండటం హైదరాబాద్ కు ఉన్న అదనపు సదుపాయం. యుద్ధ భయాలు తక్కువగా ఉండటం.. తుఫానులు లాంటి విపత్తులులేకపోవటంతో హైదరాబాద్ డేటా కేంద్రానికి అనువుగా ఉంటుందని చెబుతారు.

ఈ కారణంతోనే.. బాంబే స్టాక్ఎక్ఛ్సేంజ్ తో పాటుమరిన్ని సంస్థలు తమ డేటాను హైదరాబాద్ లో దాస్తుంటారు. దీనికి తోడు ముంబయి.. ఢిల్లీ.. బెంగళూరు.. తదితర నగరాల్లో  కార్యకలాపాల్ని నిర్వహించే కంపెనీలు.. తమ డేటా బ్యాకప్ కు హైదరాబాద్ సురక్షితంగా భావిస్తుంటారు. తాజాగా ఈ రంగంలో అమెజాన్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటంతో.. ఈ అంశం మరోసారి తెర మీదకు రావటమే కాదు.. హైదరాబాద్ కున్న ప్రత్యేకతను చాటి చెప్పినట్లైంది.
Tags:    

Similar News