ఏపీకి ఈసారైనా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందా?

Update: 2023-01-19 14:30 GMT
మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు సాగుతున్నాయి. 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అలాగే వచ్చే ఏడాది వేసవిలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల నుంచి ప్రధాన సామాజికవర్గాలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని ఆయా ప్రధాన సామాజికవర్గాల నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌ గఢ్‌ వంటి రాష్ట్రాలు బీజేపీకి ప్రధానమైనవి. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి కీలక సామాజికవర్గాల నేతలకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన పార్టీతో కలసి బీజేపీ పొత్తును కొనసాగిస్తోంది. ఏపీలోనూ గట్టిగా బలపడాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఇటీవల ప్రధాని మోడీ విశాఖపట్నం. అంతకుముందు భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు పార్టీని ఏపీలో క్షేత్ర స్థాయి నుంచి బలపడేలా చేయాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాజమండ్రిలో సభ నిర్వహించి బీజేపీ ఏపీలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో ఏపీ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఎవరికైనా చోటు ఇస్తారా అనేదానిపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ నుంచి బీజేపీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో సీఎం రమేష్‌ టీడీపీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరారు. అలాగే జీవీఎల్‌ నరసింహారావు ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ వంటివారు బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ వారి పదవీకాలం ముగిసింది.

ఈ క్రమంలో బీజేపీ ఎవరికైనా కేంద్ర మంత్రిగా చాన్సు ఇస్తే జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌ ల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరూ బీజేపీ ఆశిస్తున్న ప్రధాన సామాజికవర్గాలకు చెందినవారు కాదు. అందువల్ల వీరిద్దరికీ చాన్సు దక్కకపోవచ్చని అంటున్నారు.

బీజేపీ దృష్టి అంతా ఇప్పుడు కాపు సామాజికవర్గంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు కేంద్ర మంత్రివర్గంలో చాన్సు ఇవ్వాల్సి ఉంటుంది. సోము వీర్రాజు కాపు సామాజికవర్గానికి చెందినవారు. లేదా కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కన్నా సైతం కాపులే. అయితే అటు కన్నా, ఇటు సోము ఇద్దరూ ఎంపీలు కాదు. కేంద్ర మంత్రివర్గంలో వీరు చేరినా ఆరు నెలల్లోపు పార్లమెంటులో ఏదో ఒక సభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News