ఈ సామెతను మోడీకి అర్థమయ్యేలా చెప్పి ఉండొచ్చు బాస్

Update: 2021-11-19 06:10 GMT
యావత్ భారతావని పరమపవిత్రంగా ఫీలయ్యే రోజుల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. కొంతమంది అయితే ఈ రోజును పండుగలా జరుపుకుంటారు. వ్రతాలు చేసుకుంటారు. అలాంటి రోజున పొద్దుపొద్దున్నే జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. ఉరుము మెరుపు లేకుండానే భారీ ఆనందాన్ని కలిగించే స్వీట్ న్యూస్ చెప్పేశారు. దాదాపుగా ఏడాదికి పైనే సాగుతున్న రైతు ఉద్యమాన్ని నీరు కార్చేందుకు మోడీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. ఆ మాటకువస్తే.. ఈ మధ్యన యూపీలో కేంద్రమంత్రి కొడుకు ఏకంగా భారీ వాహనాన్ని రైతుల మీదకు ఎక్కించేందుకు సైతం వెనుకాడలేదు.

లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చి.. రైతుల నడ్డి విరిచే మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని నినదిస్తే.. నో అంటే నో అన్న మోడీ మాష్టారికి హటాత్తుగా ఏమైందో ఏమో కానీ.. ఆ మూడు చట్టాల్ని రద్దు చేస్తామన్న ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారని చెప్పాలి? ఇంతకీ మోడీలో ఇంత మార్పునకు కారణం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలని కొందరు.. కానే కాదు రానున్న రోజుల్లో వస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న పోస్టులు కొన్ని ఆసక్తికరంగా మారాయి. అందులో చూసినంతనే ఆకర్షించే కొన్ని పోస్టులు ఉన్నాయి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఎడ్చిన రాజ్యం బాగుపడదన్న విషయాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు గుర్తించిందన్న మాటలో అంతో ఇంతో పాయింట్ ఉందనే చెప్పాలి. మోడీ నిర్ణయం తీసుకోవటానికి రైతులు సుదీర్ఘ పోరాటం మాత్రమే కాదు.. 650 మందికి పైగా రైతులు బలిదానాలు చేయాల్సి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత మాత్రమే మోడీ అండ్ కో మనసులు మారాయా? అన్నది ప్రశ్న.

రైతుల బలిదానాల కంటే కూడా దేశ వ్యాప్తంగా విపక్షాలు బలపడుతున్న వైనం.. తమ బలం తగ్గుతున్న విషయాన్ని గుర్తించటమే అన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. రైతు కంట తడి దేశానికి మంచా? చెడా? అన్నది పక్కన పెడితే.. తమను అధికారం నుంచి దూరం చేస్తారన్న వాస్తవాన్ని మోడీకి బాగా అర్థమయ్యేలా.. మన తెలుగు సామెతను కాస్తంత మార్చి చెప్పి ఉంటారు. అందుకే మోడీలో ఇంత మార్పు అని చెప్పక తప్పదు. ఏమంటారు?
Tags:    

Similar News