పవన్ కు పాలించే అవకాశం వస్తుందా ?

Update: 2022-10-05 16:30 GMT
జనసేన అదినేత పవన్ కల్యాణ్ కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం రావాలని మెగాస్టార్, సోదరుడు చిరంజీవి చాలా బలంగా కోరుకున్నారు. తమ్ముడు కాబట్టి పవన్ సీఎం అయితే బావుణ్ణని అనుకోవటంలో తప్పేమీలేదు. కానీ అందుకు అవకాశం ఉందా ? చిరంజీవి కోరికను గ్రహగతులను బట్టి కాకుండా  లాజికల్ గా ఆలోచిస్తే ఏమాత్రం అవకాశం కనబడటంలేదు. అందుకు కారణం పవన్ వైఖరనే చెప్పాలి.

ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ సీఎం కావాలంటే ముందు జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీచేయాలి. అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేసి అందులో సగానికిపైగా సీట్లలో గెలిస్తే కానీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.

ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా  175 సీట్లలో కనీసం 88 సీట్లకు పైగా గెలవాలి. సీఎం అయ్యే విషయాన్ని పక్కనపెట్టేస్తే అసలు జనసేన 175 సీట్లకు పోటీచేయగలుగుతుందా ? ఇపుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీతోనే కలిసి పోటీచేయాలన్నా 100 సీట్లకు మించి పోటీచేసే అవకాశంలేదు.

ఎన్నిసీట్లలో పోటీచేస్తుంది ? ఎన్నిసీట్లలో గెలుస్తుందనేది చాలా కీలకం. ఒకవేళ బీజేపీతో కలిసి పోటీచేయకపోతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా ? టీడీపీతో పొత్తుపెట్టుకుంటే జనసేన పోటీచేసే స్ధానాలు మ్యాగ్జిమమ్ 50 దాటదు.

ఎందుకంటే అదికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న టీడీపీ 125 సీట్లలో పోటీచేసి 88 సీట్లకు పైగా గెలవాలని కోరుకుంటుంది. అంటే పోటీచేయటం, గెలవటంలో మేజర్ పార్టనర్ టీడీపీయే అవుతుంది. మరపుడు సీఎం అయ్యే అవకాశం చంద్రబాబునాయుడుకు దక్కుతుందే కానీ పవన్ కు ఎలా దక్కుతుంది ?

పోనీ ఏపార్టీతోను పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీచేస్తుందా అంటే జనసేనకు అంత సీన్ కనబడటంలేదు. బహుశా ఇవన్నీ ఆలోచించే చిరంజీవి కూడా పవన్ 2024లోనే రాష్ట్రాన్ని ఏలాలి అని చెప్పలేదు. అంటే భవిష్యత్తులో ఎప్పుడో అవకాశం రావాలని మాత్రమే కోరుకున్నారు. మరి చిరంజీవి కోరికను జనాలు తీరుస్తారా ?  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News