నిన్న సవాల్.. నేడు సైలెన్స్

Update: 2016-03-11 10:24 GMT
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు - ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరికలతో దిగొచ్చారు. భారీ స్థాయిలో ఆయన తలపెట్టిన విశ్వరూప సదస్సు కారణంగా యమునా నదికి కాలుష్య ముప్పు ఉందన్నకారణంతో ట్రైబ్యునల్ రవిశంకర్ సంస్థకు రూ.5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే... ఆ జరిమానా తాను కట్టబోనని... అవసరమైతే జైలుకు వెళ్తానని... అంత సమర్థులైతే తనను జైళ్లో పెట్టాలని ఆయన నిన్న సవాల్ విసిరారు. కానీ... పరిస్థితులను ఆకలింపు చేసుకున్న ఆయన సీను అంత ఈజీగా లేదని గుర్తించి దారిలోకొచ్చారు. అంతమొత్తం ఒక్కసారిగా కట్టలేమని... ప్రస్తుతం కొంత చెల్లించి మిగతాది నాలుగు వారాల్లో చెల్లిస్తామని ట్రైబ్యునల్ కు తెలిపారు.

ఈ రోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడి పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ జరిపింది. రూ. 5 కోట్లు జరిమానా చెల్లించడానికి నాలుగు వారాల వ్యవధి కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫు న్యాయవాది అభ్యర్థనను గ్రీన్ ట్రైబ్యునల్ మన్నించింది. జరిమానాలో పాతిక లక్షలు ఈ రోజు చెల్లించి మిగిలిన 4.75 కోట్ల రూపాయలను నాలుగు వారాల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది. ప్రపంచ సాంస్కృతికోత్సవ నిర్వహణ కారణంగా పర్యావరణానికి భంగం కలిగించినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ రవిశంకర్ కు రూ.5 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  మరోవైపు ఫైన్‌ కట్టం... జైలుకెళ్తామన్న రవిశంకర్‌ వ్యాఖ్యలపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్‌ను వివాదస్పదం చేయవద్దంటూ హెచ్చరించింది. దీంతో రవిశంకర్ దిగిరాక తప్పలేదు. అయితే... అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో తన సంస్తను వ్యాపింపజేసిన రవిశంకర్ రూ.5 కోట్లు కట్టడానికి కూడా కష్టపడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News