రాహుల్‌కు అవ‌కాశం ఇస్తామ‌న్నా.. ఎందుకు యాక్టివ్ లేదో?!

Update: 2021-07-12 08:39 GMT
కేంద్రంలో అధికారం. అందునా.. మాయా మ‌శ్చీంద్రుడిలాగా ప్ర‌తి అవ‌కాశాన్నీ త‌న‌కు అనుకు అనుకూలంగా మ‌లుచుకుని.. మాట‌ల మంత్రాల‌తో మ‌త్తెక్కిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వంటి వ్య‌క్తిని అధికారం నుంచి దింపి.. కేంద్రంలో పాగా వేయ‌డం అనేది ఇప్పుడున్న ప‌రిస్థితిలో అంత ఈజీకాదు. మ‌రీ ముఖ్యంగా.. బీజేపీ నేత‌లు.. `పప్పు` అని ముద్ర వేసిన‌.. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌కు ఒంట‌రి పోరుతో అధికారం ద‌క్కించుకోవ‌డం అనేది మ‌రింత క‌ష్టం. వ‌రుస‌గా రెండుసార్లు అధికారం కోల్పోవ‌డం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ‌. దీని నుంచి కోలుకుని గాంధీల వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. అధికారం ద‌క్కించుకునే విష‌యం రాహుల్‌గాంధీ తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యారు.

రెండు ఎన్నిక‌ల ప‌రాభవం త‌ర్వాత అయినా.. ఆయ‌న‌లో మార్పు వ‌చ్చిందా? అంటే.. అది కూడా లేదు. పోనీ.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీపైనా.. మోడీపైనా.. వివిధ కార‌ణాల‌తో ప్ర‌జ‌ల్లో పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు, పార్టీకి అనుకూలంగా కూడా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం రాహుల్ చేయ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌తో పాటుప్ర‌తిప‌క్ష పార్టీల‌ను, మేధావుల‌ను తొక్కేసే అజెండాతో దూసుకుపోతున్న న‌రేంద్ర మోడీని ఎట్టి ప‌రిస్థితిలోనూ గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్షాలు థ‌ర్డ్ ఫ్రంట్ జ‌పం చేస్తున్నాయి. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌హారాష్ట్ర‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్‌.. బీహార్‌కు చెందిన ఆర్జేడీ నేత‌లు కూడా థ‌ర్డ్ ఫ్రంట్ పెట్టి.. మోడీని గ‌ద్దెదింపే కార్య‌క్ర‌మాన్ని షురూ చేయాల‌ని అనుకుంటున్నారు.

అయితే.. ఇవ‌న్నీ ప్రాంతీయ పార్టీలు కావ‌డంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను క‌లుపుకొని వెళ్లాల‌ని వీరు తీర్మానించుకున్నారు. ఇప్ప‌టికే.. ఆర్జేడీ నేత తేజ‌స్వి, శ‌ర‌ద్ ప‌వార్‌.. రాహుల్ ఉంటేనే త‌ప్ప‌.. థ‌ర్డ్ ఫ్రంట్ ప‌రిప‌క్వం కాద‌ని.. తేల్చేశారు. మేముంటాం.. మీరు రండి.. అంటూ.. వారు ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. మ‌రి ఇంత స‌పోర్టు వ‌స్తున్నా కూడా రాహుల్ ఎక్కడా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గాంధీల వార‌సుడిగా.. ఇంతా పంతాలు, ప‌ట్టింపులు.. త‌న మాటే నెగ్గాల‌నే రాజ‌రికపు మూడ్ నుంచి ఆయ‌న బ‌య‌ట‌ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో రాహుల్ పుంజుకుంటారా?  లేదా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

రాహుల్‌ను గ‌మ‌నిస్తే.. రాజ‌కీయంగా ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోయేప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న ఉంది. ఎంత సేపూ.. ట్విట్ట‌ర్‌లో పిట్ట ప‌లుకుల‌తోనే ఆయ‌న స‌రిపెడుతున్నార‌ని.. దీంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువ కాలేక‌పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఏ పార్టీ నేతైనా.. పుంజుకోవాలంటే.. ఎన్ని సోష‌ల్ మీడియాలు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి. అవ‌స‌ర‌మైతే.. భేష‌జాలు వ‌దిలి.. రోడ్డెక్కారు. ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు మండిపోతున్నాయి. వీటిని త‌న‌కు అవ‌కాశంగా మ‌లుచుకుని రాహుల్ ముందుకు సాగాల‌ని మేధావులు స‌హా ఆయ‌న చెల్లెలు సూచిస్తున్నా.. రాహుల్ ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం గమ‌నార్హం. దీనిని బ‌ట్టి రాహుల ఇప్ప‌టికైనా బ‌య‌ట‌కు వ‌స్తారో.. లేక ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. విదేశాల‌కు వెళ్లిపోతారో.. చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News